జగన్‌ను పవన్ భయపెడుతున్నారా?

జగన్‌పై కేంద్రానికి చెప్పి ఒక ఆటాడిస్తాను అంటూ బెదిరించారు. కేంద్రం ద్వారా జగన్‌ను ఒక ఆటాడించకపోతే చూస్కో అంటే చాలెంజ్ కూడా చేశారు.

Advertisement
Update: 2023-08-11 06:15 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యవహారమంతా పిల్ల చేష్టలుగా ఉన్నాయి. చిన్న పిల్లల మధ్య ఏదన్నా గొడవ జరిగితే వెంటనే ‘మా నాన్నతో చెబుతానుండు.. మా నన్నను తీసుకొస్తానుండు’ అంటూ బెదిరిస్తుంటారు. పవన్ వైఖరి కూడా అచ్చంగా అలాగే ఉంది. వారాహి యాత్రను పవన్ విశాఖపట్నంలో మొదలుపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జగన్‌పై కేంద్రానికి చెప్పి ఒక ఆటాడిస్తాను అంటూ బెదిరించారు. కేంద్రం ద్వారా జగన్‌ను ఒక ఆటాడించకపోతే చూస్కో అంటే చాలెంజ్ కూడా చేశారు.

జగన్‌కు వ్యతిరేకంగా తాను ఫిర్యాదు చేయగానే కేంద్రం రంగంలోకి దిగేసి వైసీపీ ప్రభుత్వం పని పట్టేస్తుందని పవన్ చెప్పటమే విచిత్రంగా ఉంది. కేంద్రం దగ్గర జగన్ అవినీతి చిట్టా అంతా ఆధారాలతో సహా ఉందట. జగన్‌తో పాటు మరో పది మంది కీలక వ్యక్తుల జాతకాలు కూడా కేంద్రం దగ్గర ఉన్నాయట. పవన్ తాజా ప్రకటనలు, బెదిరింపులు చూసిన తర్వాత పవన్ మానసిక స్థాయిపైనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. జగన్ పైన తాను ఫిర్యాదులు చేయగానే కేంద్రం వెంటనే చర్యలు తీసుకుంటుందని పవన్ ఎలాగ అనుకుంటున్నారో అర్థంకావటం లేదు.

ఒకపుడేమో జగన్ పైన కేంద్రానికి ఫిర్యాదు చేయటం తనకు పెద్ద కష్టం కాదన్నారు. జగన్ విషయంలో ఏమున్నా తాను రాష్ట్రంలోనే తేల్చుకుంటానని సవాలు విసిరారు. ఇప్పుడేమో కేంద్రానికి ఫిర్యాదు చేసి జగన్ కథేంటో చెబుతానని బెదిరిస్తున్నారు. తనకు ఎంతో నమ్మకంగా ఉన్న మద్దతుదారుడు జగన్ పైన కేంద్ర ప్రభుత్వం ఎప్పటికీ చర్యలు తీసుకోదని పవన్‌కు ఇంకా అర్థంకాకపోవటమే ఆశ్చర్యంగా ఉంది.

ఇన్ని సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నా పొలిటికల్ ఈక్వేషన్లు ఎలా ఉంటాయో పవన్‌కు తెలియ‌క‌పోవటమే ఆశ్చర్యం. జగన్ మీద కేంద్రం యాక్షన్ ఎందుకు తీసుకుంటుంది? తీసుకుంటే బీజేపీకి వచ్చే లాభం ఏమిటని నరేంద్రమోడీ ఆలోచిస్తారు. జగన్ మీద యాక్షన్ తీసుకుంటే బీజేపీకి వచ్చే లాభం లేనప్పుడు ఎందుకు యాక్షన్ తీసుకుంటారు? ఇంత చిన్న లాజిక్ కూడా పవన్‌కు అర్థంకాకపోవటమే విచిత్రంగా ఉంది. ఒకవైపు జగన్ ప్రభుత్వంపై ఆరోపణలు, విమర్శలు చేస్తున్న బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరికే కేంద్రం మద్దతుగా నిలబడటంలేదు. అలాంటిది తన మాట మోడీ విని జగన్‌పై యాక్షన్ తీసుకుంటారని ఎలాగ అనుకున్నారో.

Tags:    
Advertisement

Similar News