మంత్రులపై జనసేన కార్యకర్తల దాడి

మంత్రులను, వైసీపీ నేతలను చూడగానే జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు రెచ్చిపోయారు. మంత్రుల వాహనాలపై దాడి చేశారు. దాడిలో మంత్రుల కార్ల అద్దాలు ధ్వంసం అయ్యాయి. కర్రలు, రాళ్లతో దాడికి దిగడంతో పరిస్థితి అదుపు తప్పింది.

Advertisement
Update: 2022-10-15 12:27 GMT

విశాఖ ఎయిర్‌పోర్టు వద్ద తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. మంత్రులపై జనసేన కార్యకర్తలు దాడి చేశారు. విశాఖ గర్జన ముగించుకుని మంత్రులు రోజా, జోగి రమేష్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తదితరులు తమ వాహనాల్లో ఎయిర్‌పోర్టుకు వచ్చారు. అదే సమయంలో పవన్ కల్యాణ్ కోసం అక్కడికి జనసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వచ్చారు.

మంత్రులను, వైసీపీ నేతలను చూడగానే జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు రెచ్చిపోయారు. మంత్రుల వాహనాలపై దాడి చేశారు. దాడిలో మంత్రుల కార్ల అద్దాలు ధ్వంసం అయ్యాయి. కర్రలు, రాళ్లతో దాడికి దిగడంతో పరిస్థితి అదుపు తప్పింది. మంత్రి రోజా సహాయకుడి తలకు గాయమైంది. జనసేన కార్యకర్తల దాడితో తమ వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయని.. తమ వారికి గాయాలు కూడా అయ్యాయని మంత్రి జోగి రమేష్ చెప్పారు.

దాడి సమయంలో వైవీ సుబ్బారెడ్డి, జోగి రమేష్ ఒకే కారులో ఉన్నారు. రోజా మరోకారులో ఉన్నారు. తాగుబోతులను తీసుకొచ్చి తమపై దాడి చేస్తే ఏమొస్తుందో పవన్ కల్యాణ్ ఆలోచన చేసుకోవాలన్నారు మంత్రి జోగి ర‌మేష్‌. ఇది ప్రజాస్వామ్యంలో సరైనదేనా అని ప్రశ్నించారు. పవన్‌ కల్యాణ్ ఒక చిల్లర వేషగాడన్నది మరోసారి రుజువైందన్నారు. తామే తలుచుకుంటే పవన్ అనే వ్యక్తి ఈ రాష్ట్రంలో తిరగగల‌డా అని జోగి ర‌మేష్‌ ప్రశ్నించారు. ఇలాగే రెచ్చిపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. అయితే పోలీసుల భద్రతా వైఫల్యంపైనా విమర్శలు వస్తున్నాయి.

Tags:    
Advertisement

Similar News