అవనిగడ్డలో ఆరని చిచ్చు.. పవన్‌పై జనసైనికుల తిరుగుబాటు..?

మండలి బుద్ధ ప్రసాద్‌ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు విక్కుర్తి శ్రీనివాస్. మండలి జనసేనలో చేరిన రోజును బ్లాక్ డేగా అభివర్ణించారు. ప్రపంచమంతా తిరిగి స్టేజీల మీద మాట్లాడే మండలి నైతిక విలువలు కోల్పోయాడన్నారు విక్కుర్తి.

Advertisement
Update: 2024-04-02 13:38 GMT

అవనిగడ్డ జనసేన పార్టీలో మండలి బుద్ధ ప్రసాద్‌ చేరికతో చెలరేగిన చిచ్చు ఆరడం లేదు. టీడీపీ నుంచి టికెట్ ఆశించి భంగపడిన మండలి.. పవన్‌కల్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకున్నారు. దీంతో అవనిగడ్డ నుంచి మండలి బుద్ధప్రసాద్‌ జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. పవన్ కల్యాణ్‌ నుంచి టికెట్ హామీ వచ్చిన తర్వాతే మండలి పార్టీలోకి వచ్చారన్న టాక్‌ వినిపిస్తోంది. అయితే మండలి చేరికను అవనిగడ్డ జనసేన నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

మండలి చేరికను నిరసిస్తూ అవనిగడ్డలో జనసేన కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. జనసేన నేత విక్కుర్తి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి దాదాపు 6 మండలాల నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. జనసేనకు కేటాయించిన సీటును జనసేన నేతకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. కండువాలు మార్చే రాజకీయాలు నశించాలంటూ నినాదాలు చేశారు. మండలికి వ్యతిరేకంగా అవనిగడ్డలో నిరసన ర్యాలీ నిర్వహించారు.

మండలి బుద్ధ ప్రసాద్‌ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు విక్కుర్తి శ్రీనివాస్. మండలి జనసేనలో చేరిన రోజును బ్లాక్ డేగా అభివర్ణించారు. ప్రపంచమంతా తిరిగి స్టేజీల మీద మాట్లాడే మండలి నైతిక విలువలు కోల్పోయాడన్నారు విక్కుర్తి. 40 శాతం ఓటు బ్యాంకు ఉన్న టీడీపీని వదిలి ఆరు శాతం ఓటింగ్‌ ఉన్న జనసేనలోకి వెళ్లబోనని గతంలో మండలి అన్నారని గుర్తు చేశారు. జనసేన చిన్న పిల్లల పార్టీ అంటూ అవహేళన చేశాడన్నారు. అలాంటి వ్యక్తికి సీటు ఎలా ఇస్తారని పవన్‌ను ప్రశ్నించారు. మండలికి టికెట్‌ ఇస్తే సహకరించే ప్రసక్తే లేదన్నారు.

Tags:    
Advertisement

Similar News