జనసేనకు ప్లాన్ లేదు, పాడు లేదు.. అంబటి రాయుడు

జనసేన టీడీపీతో పొత్తులో ఉంది. ఏమైందో తెలియదు గానీ అంబటి రాయుడు రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఐపీఎల్ మ్యాచ్ ల్లో ఆయన నిపుణుడిగానూ వ్యాఖ్యాతగానూ వ్యవహరిస్తున్నారు.

Advertisement
Update: 2024-04-25 15:47 GMT

ప్రముఖ క్రికెట‌ర్‌ అంబటి రాయుడు జనసేన స్లార్ కాంపెయినర్ల జాబితాలో ఉన్నారు. అయితే, ఆయన ప్రచారానికి రావడం లేదు. ఈ విషయంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. స్టార్ కాంపెయినర్‌గా ఉంటూ ప్రచారానికి రావడం లేదేమిటనే ప్రశ్నకు ఆయన ఎక్స్ వేదికగా గట్టిగానే రిప్లై ఇచ్చారు. అయితే, తాను ఎక్స్ లో పోస్టు చేసిన కామెంట్ ను కాసేప‌టికే తొలగించారు. జనసేన తీరుపై ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఇది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

అంబటి రాయుడు టీమిండియా ప్లేయర్ గానూ సిఎస్కే జట్టు సభ్యుడిగాను క్వాలిటీ క్రికెట్ ఆడారు. అయితే, ఆయన రాజకీయాల్లోకి అడుగు పెట్టాలని నిర్ణయం తీసుకుని ముఖ్యమంత్రి జగన్ ను కలిశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు కూడా. ఆయన గుంటూరు పార్లమెంటు సీటును ఆశించారు. అయితే, అది వర్కవుట్ కాలేదు. జగన్ ఆయన గుంటూరుకు బదులు మచిలీపట్నం టికెట్ ఇస్తానని చెప్పినట్లు తెలిసింది. అది నచ్చక ఆయన వైఎస్సార్ సీపీ నుంచి బయటకు వచ్చి పవన్ కల్యాణ్ నాయకత్వంలోని జనసేనలో చేరారు.

జనసేన టీడీపీతో పొత్తులో ఉంది. ఏమైందో తెలియదు గానీ అంబటి రాయుడు రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఐపీఎల్ మ్యాచ్ ల్లో ఆయన నిపుణుడిగానూ వ్యాఖ్యాతగానూ వ్యవహరిస్తున్నారు. మ్యాచ్ లపై తెలుగులో ఆయన తన అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఈ సమయంలోనే ఆయన జనసేనకు ప్రచారం చేయకపోవడంపై ప్రశ్న తలెత్తింది.

తాను రావడానికి సిద్ధంగా ఉన్నానని, కానీ కార్యాచరణ ప్రణాళిక ఏమిటో ఎవరైనా చెప్పగలరా? జనసేన జెండా పట్టుకుని నినాదాలు ఇస్తూ రోడ్లపై తిరగాలా? అని ఆయన అన్నారు. జనసేనకు ప్లానింగ్ లేదని ఆయన చెప్పకనే చెప్పారు. అయితే, ఈ వ్యాఖ్యలను ఆయన తొలగించారు. ఏమైనా, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీరు ఆయనకు నచ్చలేదనేది మాత్రం అర్థమవుతోంది.

Tags:    
Advertisement

Similar News