వ్యూహాలు సిద్ధంగా ఉన్నాయా?

ఏది ఏమైనా పవన్ ముందున్న ఏకైక వ్యూహం ఏమిటంటే చంద్రబాబుతో పొత్తులు కుదుర్చేసుకోవటమే అని అందరికీ అర్థ‌మైంది. కాకపోతే పొత్తును చంద్రబాబుతో కలిసి పవన్ ప్రకటించేంతవరకు కన్ఫ్యూజన్ తప్పేట్లు లేదు.

Advertisement
Update: 2023-03-31 05:23 GMT

రాబోయే ఎన్నికల్లో వైసీపీని ఎదుర్కొనే విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ దగ్గర వ్యూహాలు సిద్ధంగా ఉన్నాయా? ఉన్నాయనే చెప్పారు. పార్టీలోని ముఖ్యనేతలతో పవన్ టెలికాన్ఫరెన్సులో మాట్లాడుతూ.. వైసీపీని ఎలా ఎదుర్కోవాలనే విషయాన్ని తనకు వదిలేయాలన్నారు. ఎన్నికలను ఎదుర్కొనే విషయంలో తన దగ్గర వ్యూహాలు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. పొత్తులు, వ్యూహాలు, ఎన్నికల విషయాలను తనకు వదిలేసి పార్టీని బలోపేతం చేసే విషయాన్ని మాత్రమే నేతలు చూడాలన్నారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇదేమాట పవన్ చాలాకాలంగా చెబుతున్నారు. ఎన్నికలు, పొత్తుల విషయాన్ని తనకు వదిలిపెట్టేయాలని బహిరంగసభల్లో కూడా నేతలకు చెప్పారు. ఒకటే మాటను పదేపదే చెబుతున్నారే కానీ ఆ వ్యూహాలేమిటో మాత్రం ఎవరికీ ఇంతవరకు చెప్పలేదు. పార్టీ మొత్తానికి తెలిసిందేమిటంటే తమ అధినేతకు జగన్మోహన్ రెడ్డంటే విపరీతమైన ధ్వేషముందని. ఇదే సమయంలో చంద్రబాబు నాయుడు అంటే వల్లమాలిన అభిమానమని.

జగన్ అంటే వ్యతిరేకత ఎందుకొచ్చింది? చంద్రబాబు అంటే అంతటి అభిమానం ఎందుకు? అన్న విషయం మాత్రం నేతల్లో క్లారిటిలేదు. ఏదేమైనా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనిచ్చేది లేదు అన్న మాటను మాత్రం పవన్ ఇప్పటికే చాలాసార్లు చెప్పారు. నిజానికి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనివ్వకుండా చూడటం పవన్ వల్లకాదు. ఈ విషయం పవన్‌కు తప్ప మిగిలిన అందరికీ అర్థ‌మవుతోంది. అయినా అదే మాటను పదేపదే చెబుతున్నారు.

పోనీ అందుకు తగ్గట్లు ఇప్పటికే ఏదైనా వ్యూహం తయారైందా అంటే అదీ చెప్పటంలేదు. అందరికీ అర్థ‌మవుతున్నది ఏమిటంటే టీడీపీతో పొత్తు పెట్టుకోబోతున్నట్లు. బీజేపీని కాదని టీడీపీతో పొత్తు పెట్టుకునేంత ధైర్యం పవన్ చేస్తారా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనా పవన్ ముందున్న ఏకైక వ్యూహం ఏమిటంటే చంద్రబాబుతో పొత్తులు కుదుర్చేసుకోవటమే అని అందరికీ అర్థ‌మైంది. కాకపోతే పొత్తును చంద్రబాబుతో కలిసి పవన్ ప్రకటించేంతవరకు కన్ఫ్యూజన్ తప్పేట్లు లేదు. ఒకసారి ప్రకటించిన తర్వాత ఏమి జరుగుతుందో చూడాల్సిందే. మొత్తానికి పవన్ రాజకీయమంతా మొదటి నుండి గందరగోళంగానే ఉంటోందన్నది మాత్రం వాస్తవం.

Tags:    
Advertisement

Similar News