జనసేనలో అగ్గి అంటుకుంది.. - సీట్లు కేటాయించకపోవడంపై రోడ్డెక్కిన కేడర్‌

తణుకులో కేడర్‌తో సమావేశమైన విడివాడ.. 2019లో తనను కాదని మరో వ్యక్తికి టిక్కెట్‌ ఇచ్చినా సహించానని, పదేళ్లుగా రూ. కోట్లు ఖర్చు పెట్టానని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement
Update: 2024-02-27 04:47 GMT

టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా సీట్ల కేటాయింపు వ్యవహారం జనసేన పార్టీలో కాక రేపింది. ఏళ్ల తరబడి పార్టీనే నమ్ముకుని ఉన్నవారిని నమ్మించి వంచించడంపై కేడర్‌ అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గ ఇన్‌చార్జి విడివాడ రామచంద్రరావు ఏకంగా టికెట్‌ ఇవ్వకపోతే చచ్చిపోతానని హెచ్చరించడం గమనార్హం. తాడేపల్లిగూడెం సభ ఏర్పాట్ల పరిశీలన కోసం వచ్చి.. సమీపంలోని ఓ గెస్ట్‌హౌస్‌లో బస చేసిన జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ను నిలదీసేందుకు కేడర్‌ సోమవారం రాత్రి తణుకు నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. గెస్ట్‌హౌస్‌ను ముట్టడించారు. నాదెండ్ల మనోహర్‌ బయటికి రాకపోవడంతో సహనం నశించిన కార్యకర్తలు గెస్ట్‌హౌస్‌ తలుపులు పగలగొట్టడానికి యత్నించారు. ఈ క్రమంలో పార్టీ నేతలు బొలిశెట్టి శ్రీను, కొటికలపూడి గోవిందరావు తదితరులు న‌చ్చ‌జెప్పేందుకు ప్రయత్నించగా, వారిపైనా ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు.

మరోపక్క రోడ్లపై ఏర్పాటుచేసిన పవన్‌ ఫ్లెక్సీలను చించేస్తూ.. పవన్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తణుకులో కేడర్‌తో సమావేశమైన విడివాడ.. 2019లో తనను కాదని మరో వ్యక్తికి టిక్కెట్‌ ఇచ్చినా సహించానని, పదేళ్లుగా రూ. కోట్లు ఖర్చు పెట్టానని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల్లో టిక్కెట్‌ విషయం తేల్చకపోతే తన భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటిస్తానని వెల్లడించారు. తెలుగుదేశం జెండా మోసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

మరోవైపు నెల్లూరులోనూ జనసేన కార్యకర్తలు రోడ్డెక్కారు. నెల్లూరు సిటీ లేదా నెల్లూరు రూరల్‌ సీటు ఇస్తారని ఆశ పెట్టుకున్న మనుక్రాంత్‌ రెడ్డి.. టికెట్‌ కేటాయించకపోవడంతో తీవ్ర మనస్తాపంతో సోమవారం నెల్లూరులోని జనసేన కార్యాలయం వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. చంద్రబాబు మాయలో పడి పవన్‌ మోసపోయాడని కేడర్‌ మండిపడ్డారు. టీడీపీకి ఓటేసే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు.

ఇక ఏలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి రెడ్డి అప్పలనాయుడు సోమవారం ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఏకంగా కన్నీళ్లు పెట్టుకోవడం గమనార్హం. టీడీపీ అభ్యర్థి బడేటి చంటికి ఏలూరు సీటు కేటాయించడంపై కేడర్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తూ చంద్రబాబు ఫ్లెక్సీలను చించివేశారు. సీటు విషయంపై పవన్‌ పునరాలోచన చేసి రెండురోజుల్లో తేల్చి చెప్పాలని.. లేదంటే తన భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తానని రెడ్డి అప్పలనాయుడు స్పష్టం చేశారు. రెబల్‌ అభ్యర్థిగా పోటీ చేయాలని ఈ సందర్భంగా కేడర్‌ నినాదాలు చేయడం గమనార్హం.

కాకినాడ జిల్లాలోనూ జనసేన కేడర్‌లో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. జగ్గంపేట సీటు తనకు కేటాయించకపోవడంపై జనసేన ఇన్‌చార్జి పాటం శెట్టి సూర్యచంద్ర అచ్యుతాపురంలో ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయనేది ఆసక్తికరంగా మారింది.

Tags:    
Advertisement

Similar News