జగన్ ప్లాన్ వర్కవుటైతే ..

స్థానిక సంస్థ‌ల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా కుడిపూడిని దించితే గెలుపు ఖాయం. కాబట్టి ఆయన నాయకత్వంలోని బీసీలు ముఖ్యంగా శెట్టిబలిజల మద్దతు వైసీపీకి దొరుకుతుందని జగన్ అంచనా వేస్తున్నారు.

Advertisement
Update: 2023-02-15 05:37 GMT

రాబోయే ఎన్నికల్లో మళ్ళీ గెలుపు కోసం జగన్మోహన్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. పావులు కదపటంలో ఒక మార్గం ఏమిటంటే సోషల్ ఇంజనీరింగ్. ఈ పద్ధ‌తిని జగన్ 2019 ఎన్నికలకు ముందునుండే అవలంభిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో కూడా ఇదే పద్ధ‌తిని అనుసరించి తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే తొందరలో భర్తీ అవబోయే ఎమ్మెల్సీ స్థానాలను ఉపయోగించుకోబోతున్నారు. ఇప్పుడు విషయం ఏమిటంటే స్థానిక సంస్థ‌ల కోటాలో బీసీ నేత కుడిపూడి సూర్యనారాయణను పోటీలోకి దించాలని జగన్ డిసైడ్ అయినట్లు పార్టీ వర్గాల సమాచారం.

కుడిపూడి తూర్పుగోదావరి జిల్లాలోని అమలాపురానికి చెందిన వ్యక్తి. బీసీల్లో ముఖ్యంగా శెట్టిబలిజల్లో తిరుగులేని పట్టున్న నేత. గోదావరి జిల్లాల్లో బీసీలకు కాపులకు ఏమాత్రం పడదన్న విషయం తెలిసిందే. అలాగే బీసీలకు ఎస్సీలకు కూడా పడదు. రెండు జిల్లాల్లోనూ ముఖ్యంగా బీసీల్లో శెట్టిబలిజలదే ఆధిపత్యం. ఇలాంటి శెట్టిబలిజల్లో కుడిపూడికి మంచిపట్టుంది. ఈమధ్యన కుడిపూడి ఎక్కడ మాట్లాడినా పాత విభేదాలను మరచిపోయి బీసీలు, కాపులు కలిసి పనిచేయాలని చెబుతున్నారు. ఇందులో భాగంగా సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు.

ఇలాంటి కుడిపూడికి టికెట్ ఇచ్చి స్థానిక సంస్థ‌ల కోటాలో పోటీ చేయించాలని జగన్ అనుకున్నట్లు సమాచారం. రెండు రోజుల క్రితమే జగన్‌తో కుడిపూడి అర్ధగంట పాటు భేటీ అయ్యారు. కుడిపూడిని వైసీపీ తరపున పోటీ చేయించటం ద్వారా రాబోయే ఎన్నికల్లో పార్టీకి జరిగే లాభం గురించే చర్చలు జరిగి ఉంటాయనటంలో సందేహం లేదు. ఎందుకంటే ఇప్పటివరకు కుడిపూడికి వైసీపీతో ప్రత్యక్ష సంబంధాల్లేవు.

కుడిపూడిని గనుక పార్టీ తరపున అభ్యర్థిగా దించితే గెలుపు ఖాయం. కాబట్టి ఆయన నాయకత్వంలోని బీసీలు ముఖ్యంగా శెట్టిబలిజల మద్దతు వైసీపీకి దొరుకుతుందని జగన్ అంచనా వేస్తున్నారు. ఇప్పటికే బీసీలకు పెద్దపీట వేస్తున్నా, నూరు శాతం బీసీలను వైసీపీలోకి లాక్కోవాలన్నది జగన్ ప్లాన్. మత్స్యకారులకు చెందిన కైకలూరు మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణను కూడా ఇందుకే పార్టీలో చేర్చుకుంటున్నారు. ఈయనకు కూడా ఎమ్మెల్సీ టికెట్ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. బీసీలు నూరు శాతం వైసీపీ వైపు రావాలంటే బలమైన నేతలు పార్టీలో ఉండాలని జగన్ అనుకుంటున్నారు. చివరకు ఏమవుతుందో చూడాలి.

Tags:    
Advertisement

Similar News