అమరావతి పేదలది కూడా..

రాజధాని మాస్టర్ ప్లాన్‌లోని ఎస్‌-3 జోన్‌లోని పలు గ్రామాల పరిధిలో 268 ఎకరాలు కావాలని సీఆర్‌డీఏకు ప్రతిపాదన వచ్చింది. ఆ ప్రతిపాదనకు వెంటనే సీఆర్‌డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ ఆమోదం తెలిపారు.

Advertisement
Update: 2023-05-10 03:18 GMT

అమరావతిలో పేదలకు పెద్ద ఎత్తున నివాస అవకాశం కల్పించేందుకు జగన్ ప్రభుత్వం వేగంగా ముందుకెళ్తోంది. ఇప్పటికే అమరావతిలో 1,134 ఎకరాలను పేదల ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం కేటాయించింది. దాన్ని సవాల్ చేస్తూ అమరావతివాదులు హైకోర్టుకు వెళ్లగా వారికి అక్కడ చుక్కెదురైంది. హైకోర్టు తీర్పు తర్వాత ప్రభుత్వం ఇళ్ల పట్టాల పంపిణీకి వేగంగా పనులు చేస్తోంది. తాజాగా మరో 268 ఎకరాల భూమిని పేదల ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం కేటాయిస్తోంది.

రాజధాని మాస్టర్ ప్లాన్‌లోని ఎస్‌-3 జోన్‌లోని పలు గ్రామాల పరిధిలో 268 ఎకరాలు కావాలని సీఆర్‌డీఏకు ప్రతిపాదన వచ్చింది. ఆ ప్రతిపాదనకు వెంటనే సీఆర్‌డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ ఆమోదం తెలిపారు. ఈ భూమికి గాను ప్రభుత్వం సీఆర్‌డీఏకు డబ్బు చెల్లిస్తుంది. ఎస్‌-3 జోన్‌లో భూముల విలువ ఎక్కువగానే ఉన్నప్పటికీ పేదల ఇళ్ల స్థలాల కోసం కావడంతో ఎకరం 24.4 లక్షలకే ప్రభుత్వానికి అప్పగించేందుకు సీఆర్‌డీఏ అంగీకరించింది.

ఈ 268 ఎకరాల్లో ఎన్టీఆర్ జిల్లాలోని పేదల కోసం 168 ఎకరాలు, గుంటూరు జిల్లాకు సంబంధించిన పేదల కోసం 100 ఎకరాలను కేటాయించనున్నారు. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల నిర్ణయాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ సమర్థించుకున్నారు. అమరావతి భూములు ఏమైనా బ్రహ్మపదార్థ‌మా అని ప్రశ్నించారు. 30వేల ఎకరాల్లో ప్రభుత్వ భవనాలే కాకుండా పేదలకు నివాసం కూడా ఉండాలన్నారు. అమరావతి భూములు ప్రస్తుతం ప్రభుత్వానికి చెందినవని మంత్రి వ్యాఖ్యానించారు.

అయితే ఇప్పటికే ఆర్‌-5 జోన్‌ ఏర్పాటు చేసి 1134 ఎకరాలను పేదలకు ఇవ్వడాన్ని సమర్థిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ అమరావతి రైతులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. అక్కడ కేసు విచారణ మొదలు కావాల్సి ఉంది. ఆలోపే అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ పక్రియను పూర్తి చేసే యోచనతో ప్రభుత్వం శరవేగంగా ముందుకెళ్లోంది. భూమిని చదును చేయడం, హద్దు రాళ్లు పాతడం వంటి పనులను దాదాపు పూర్తి చేసింది యంత్రాంగం.

Tags:    
Advertisement

Similar News