2024లో జరిగేది క్లాస్ వారేనా?

పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని లబ్ధిదారులు జగన్‌పై టీడీపీ, జనసేన నేతలు చేసిన ప్రచారాన్ని పట్టించుకోలేదు. దీంతోనే జగన్ పెత్తందార్లు-పేదల క్లాస్ వార్ వ్యూహం పక్కాగా అమలైనట్లు అర్థ‌మైంది.

Advertisement
Update: 2023-07-20 04:44 GMT

రాబోయే ఎన్నికలు ‘క్లాస్ వార్’ అనే లైన్‌ మీదే జరగబోతున్నాయని అనిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ మాట్లాడినా రాబోయే ఎన్నికలు పెత్తందార్లకు పేదలకు మధ్య జరగబోతున్నాయని, దాన్నే క్లాస్ వార్ అని పదేపదే చెబుతున్నారు. దానికి తగ్గట్లే చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ నడుకుంటున్నారు. 24 గంటలూ, 365 రోజులూ కేవలం జగన్‌ను మాత్రమే టార్గట్ చేస్తున్నారు. ఇదే సమయంలో వీళ్ళిద్దరూ చాలాకాలం సంక్షేమ పథకాలకు వ్యతిరేకంగా మాట్లాడారు.

సంక్షేమ పథకాలను అమలు చేస్తూ జగన్ ఏపీని శ్రీలంక కన్నా ఘోరంగా తయారు చేస్తున్నారని ఊరూ వాడా తిరిగి మరీ ప్రచారం చేశారు. వీళ్ళు ఆరోపణలు గుప్పించటమే కాకుండా ఎల్లో మీడియాతో కూడా వారాల తరబడి అలాంటి వార్తలు, కథనాలు రాయించారు. దీన్ని అవకాశంగా తీసుకుని చంద్రబాబు, పవన్ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలన్నింటినీ నిలిపేస్తారని జగన్, మంత్రులు పదేపదే ప్రచారం చేశారు. జగన్ చేసిన ప్రచారం జనాల్లోకి బాగా వెళ్ళింది. సంక్షేమ పథకాల అమలులో చంద్రబాబు హయాంలో జరిగిన విషయాలు గుర్తు చేసుకున్న జనాలు కూడా జగన్ చెప్పింది నిజమే అని నమ్మారు.

దాంతో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని లబ్ధిదారులు జగన్‌పై టీడీపీ, జనసేన నేతలు చేసిన ప్రచారాన్ని పట్టించుకోలేదు. దీంతోనే జగన్ పెత్తందార్లు-పేదల క్లాస్ వార్ వ్యూహం పక్కాగా అమలైనట్లు అర్థ‌మైంది. అంటే తన అజెండాలోకి చంద్రబాబు, పవన్‌ను జగన్ సక్సెస్ ఫుల్‌గా లాగేశారని అర్థ‌మవుతోంది. జరిగిన డ్యామేజీని అర్థంచేసుకోవటానికి చంద్రబాబు, పవన్, ఎల్లో మీడియాకు టైం పట్టింది. జరిగిన డ్యామేజీ అర్థ‌మైన వెంటనే చంద్రబాబుకు అలవాటైన యూటర్న్ తీసుకున్నారు. జగన్ ప్రభుత్వానికి మించిన సంక్షేమ పథకాలను అమలు చేస్తానంటు ఊదరగొడుతున్నారు. మహానాడులో మొదటి విడత మ్యానిఫెస్టో పేరుతో భవిష్యత్తుకు గ్యారెంటీ అని చెప్పటం మొదలుపెట్టారు.

ఇచ్చిన ఆరు హామీలకు సూపర్ సిక్స్ అని పేరు పెట్టారు. అయితే ఈ సూపర్ సిక్స్ ను జనాల్లోకి తీసుకెళ్ళటంలో తమ్ముళ్ళుతో పాటు ఎల్లోమీడియా దారుణంగా ఫెయిలైంది. ఈ విషయం మీద తమ్ముళ్ళపై చంద్రబాబు తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. అందుకనే తమ్ముళ్ళతో బస్సు యాత్రలని, మహిళా నేతలతో గ్రామీణ ప్రాంతాల పర్యటనలు మొదలుపెట్టించారు. తొందరలో తాను కూడా పల్లెనిద్ర చేయబోతున్నారు. మొత్తం మీద 2024 ఎన్నికలు క్లాస్ వార్ లైన్‌లోనే జరగటం ఖాయమని అర్థ‌మవుతోంది.

Tags:    
Advertisement

Similar News