కాపుల చేతిలో చంద్రబాబు ఇరుక్కుపోయారా..?

పవన్ పార్టీ ఆఫీసులో మాట్లాడుతూ మొత్తం సీట్లలో మూడోవంతు నియోజకవర్గాల్లో జనసేన పోటీచేస్తుందని ప్రకటించారు. 175 సీట్లలో మూడోవంతు అంటే సుమారు 58 నియోజకవ‌ర్గాలు.

Advertisement
Update: 2024-01-28 05:02 GMT

ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకోవటానికే కానీ, నిజానికి ఆ అనుభవం చంద్రబాబునాయుడుకు ఎందుకు పనికిరావటంలేదు. ప్రస్తుత కాలానికి తగ్గట్లుగా వ్యూహ ప్రతివ్యూహాల్లో అప్ డేట్ కాకపోవటం, ప్రతిచిన్నదానికి ఎల్లోమీడియా మీద అతిగా ఆధారపడటమే ఇప్పుడు చంద్రబాబుకు ఇబ్బందిగా తయారైంది. ఒంటరిగా పార్టీని ఎన్నికల్లో పోటీచేయించే ధైర్యం లేకపోవటంతో అందరికీ అలుసైపోయారు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే.. పవన్ కల్యాణ్ వెంటపడి జనసేనతో చంద్రబాబు పొత్తుపెట్టుకున్నారు. జనసేనను అడ్డుపెట్టుకుని కాపుల ఓట్లు గంపగుత్తగా కొల్లగొట్టి రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేయాలన్నది చంద్రబాబు ఆలోచన.

ఆలోచనలో తప్పులేదు కానీ, మిత్రపక్షం పవన్ కల్యాణ్ ను అంచనా వేయటంలోనే తప్పులో కాలేశారు. అధికారంలోకి రావటానికి పవన్ను ఉపయోగించుకోవాలని చంద్రబాబు అనుకుంటే వ్యవహారమంతా రివర్సులో నడుస్తోంది. ఇప్పుడు సమస్య ఏమిటంటే.. జనసేనకు ఎన్నిసీట్లివ్వాలి..? ఇచ్చే నియోజకవర్గాలు ఏవి..? అన్నది. పవన్ పార్టీ ఆఫీసులో మాట్లాడుతూ మొత్తం సీట్లలో మూడోవంతు నియోజకవర్గాల్లో జనసేన పోటీచేస్తుందని ప్రకటించారు. 175 సీట్లలో మూడోవంతు అంటే సుమారు 58 నియోజకవ‌ర్గాలు.

జనసేనకు ఓ 20 లేదా 25 నియోజకవర్గాలను కేటాయిస్తే సరిపోతుందని చంద్రబాబు అనుకున్నారట. కానీ ఇప్పుడు వ్యవహారం తేడా కొడుతోంది. 58 నియోజకవర్గాలను జనసేనకు కేటాయించటం అంటే టీడీపీకి ఆత్మహత్యా సదృశ్యమనే చెప్పాలి. మిత్రపక్షానికి 58 సీట్లిస్తే ఒకసమస్య ఇవ్వకపోతే మరో సమస్యగా తయారైంది వ్యవహారమంతా. జనసేనకు 58 సీట్లిస్తే వైసీపీ ఫుల్లు హ్యాపీ. అలాకాకుండా ఓ 20 లేదా 25 సీట్లతో సరిపెడితే కాపుల ఓట్లు పడవు సరికదా అసలు పవన్ ఎలా రియాక్టవుతారో కూడా చంద్రబాబుకు అర్థంకావటంలేదు.

పవన్ అడిగినన్ని సీట్లిచ్చినా కూడా కాపుల ఓట్లు సక్రమంగా టీడీపీకి పడేది అనుమానమే. అలాంటిది 25 సీట్లతో సరిపెడితే కాపుజాతిని చంద్రబాబు మరోసారి అవమానించాడని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం, పవన్ మద్దతుదారుడు చేగొండి హరిరామజోగయ్య లాంటి వాళ్ళు గయ్యుమంటారు. అప్పుడు మొదటికే మోసంవచ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదు. ఇప్పుడు చంద్రబాబు పరిస్థితి ఎలాగయ్యిందంటే పవన్ చేతిలో గట్టిగా ఇరుక్కుపోయారు. చంద్రబాబు మీద పవన్ వ్యక్తంచేసిన అసంతృప్తికి టీడీపీ నుండి సమాధానం కూడా చెప్పలేకపోవటమే పార్టీ చేతకానితనాన్ని ఎత్తిచూపుతోంది.

Tags:    
Advertisement

Similar News