చంద్రబాబు ప‌ర్య‌ట‌న‌లో ఉద్రిక్తత

పోలీసులకు చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. ఎంత మంది మీద కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి అని సవాల్ చేశారు. తమ కార్యకర్తలంతా వస్తే పోలీసు స్టేషన్లు సరిపోవన్నారు.

Advertisement
Update: 2023-02-17 14:50 GMT

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యటన ఉద్రికత్తకు దారి తీసింది. టీడీపీ కార్యకర్తలు పోలీసులపైకి దూసుకెళ్లారు. అనపర్తిలో రోడ్డుపై సభ నిర్వహించేందుకు చంద్రబాబు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దేవీచౌక్ సెంటర్ వద్దకు వెళ్లకుండా లక్ష్మీనరసాపురం వద్ద పోలీసులు రోడ్డుకు అడ్డంగా బస్సును నిలిపారు. బలభద్రాపురం దగ్గర చంద్రబాబు కారుకు అడ్డుగా బారికేడ్లు ఏర్పాటు చేశారు.

ఆ బారికేడ్లను టీడీపీ కార్యకర్తలు తొల‌గించారు. బారికేడ్లను ఎత్తిపడేసి చంద్రబాబు కారును ముందుకు తీసుకెళ్లారు. కొద్ది దూరం వెళ్లగానే రోడ్డుకు అడ్డుగా పోలీసు బస్సు ఉండడంతో చంద్రబాబు కారు దిగారు. అక్కడి నుంచి అనపర్తికి కాలినడకన వెళ్లారు. రోడ్డుకు అడ్డుగా పెట్టిన బస్సును టీడీపీ కార్యకర్తలు పక్కనే ఉన్న కాలువలోకి తోసే ప్రయత్నం చేయ‌గా పోలీసులు లాఠీచార్జ్ చేశారు.

పోలీసులకు చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. ఎంత మంది మీద కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి అని సవాల్ చేశారు. తమ కార్యకర్తలంతా వస్తే పోలీసు స్టేషన్లు సరిపోవన్నారు. అనవర్తిలో సభ నిర్వహించి తీరుతానని చంద్రబాబు ప్రకటించడంతో పోలీసులు ముందుజాగ్రత్తగా షాపులను మూసివేయించారు. అనపర్తిలో వందలాది మంది పోలీసులు మోహరించారు. జీవో 1 ప్రకారం రోడ్లపై సభలు నిర్వహించకూడదని చెప్పినా చంద్రబాబు వినకపోవడంపై పోలీసు అధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారు.

Tags:    
Advertisement

Similar News