లోకేష్ యాత్ర అనుమతులు రద్దు చేస్తారా?

ప్రభుత్వం ఇచ్చిన అనుమతులతోనూ కదా పాదయాత్ర చేస్తున్నది... శాంతిభద్రతల సమస్య వస్తుంటే ఎందుకు మౌనంగా ఉంటున్నారు?. పాదయాత్ర అనుమతి రద్దు చేయవచ్చు కదా?.. ఎవరు వద్దన్నారు? అంటూ న్యాయమూర్తి ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్‌ను ప్రశ్నించారు.

Advertisement
Update: 2023-09-06 06:27 GMT

నారా లోకేష్‌ యువగళంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. చంద్రబాబు పుంగనూరు పర్యటన సందర్భంగా అంగళ్లు వద్ద జరిగిన ఘర్షణలో పోలీసులు నమోదు చేసిన కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం టీడీపీ నేతలు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సంద‌ర్బంగా ముందస్తు బెయిల్‌ పిటిషన్లను అదనపు అడ్వకేట్ జనరల్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఇలాంటి తీవ్రమైన వ్యవహారాల్లో ముందస్తు బెయిల్ ఇస్తే ఇలాంటి గొడవలను పునరావృతం చేస్తారని వాదించారు.

నారా లోకేష్ పర్యటనలోనూ టీడీపీ నేతలు రెచ్చగొట్టే పనులు చేసున్నారని.. ఇటీవల పశ్చిమగోదావరి జిల్లా మందలపర్రు గ్రామంలో నారా లోకేష్ వెళ్తూ వెళ్తూ అక్కడే ఉన్న ఒక చర్చి వైపు వేలు చూపిస్తూ తన పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టారని.. దాంతో టీడీపీ కార్యకర్తలు చర్చిలోకి వెళ్లి ప్రార్థనలు చేస్తున్నవారిని విచక్షణారహితంగా కొట్టారని వివరించారు. చంద్రబాబు కూడా పుంగనూరు పర్యటనలో ఇలాగే శ్రేణులను రెచ్చగొట్టి పోలీసులపై దాడులు చేయించారన్నారు.

కేసులు పెట్టినా హైకోర్టుకు వెళ్దాం అక్కడ బెయిల్ వచ్చేస్తుందన్న ధైర్యంతోనే టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారని అదనపు అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి కోర్టుకు దృష్టికి తీసుకెళ్లారు. దాంతో టీడీపీ తరపు న్యాయవాదులు గట్టిగా అరుస్తూ అభ్యంతరం తెలిపారు. పుంగనూరు ఘటనపై పిటిషన్‌లు వస్తే సంబంధం లేని లోకేష్ పాదయాత్ర గురించి ప్రస్తావిస్తున్నారని అడ్డుపడ్డారు. ఈ సమయంలో ఇరుపక్షాల మధ్య గట్టిగా వాగ్వాదం జరగడంతో ఇదేమైనా చేపల మార్కెట్టా అంటూ న్యాయమూర్తి మందలించారు.

ప్రభుత్వం ఇచ్చిన అనుమతులతోనూ కదా పాదయాత్ర చేస్తున్నది... శాంతిభద్రతల సమస్య వస్తుంటే ఎందుకు మౌనంగా ఉంటున్నారు?. పాదయాత్ర అనుమతి రద్దు చేయవచ్చు కదా?.. ఎవరు వద్దన్నారు? అంటూ న్యాయమూర్తి ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్‌ను ప్రశ్నించారు. దీంతో నారా లోకేష్‌ యాత్రలో పదేపదే ఉద్రిక్తతలు ఏర్పడడంతో పాటు, గొడవలు జరుగుతున్న నేపథ్యంలో హైకోర్టు చేసిన వ్యాఖ్యల ఆధారంగా ప్రభుత్వం అనుమతుల రద్దు అంశాన్ని కూడా మునుముందు పరిశీలించే అవకాశం ఉంది.

Tags:    
Advertisement

Similar News