కూటమిలో మరో శత్రువు చేరారా..?

మూడు రాజధానులని చెప్పిన జగన్ ఒక్కటైనా కట్టారా అంటు ఎద్దేవాచేశారు. ఇది కూడా చాలాకాలంగా చంద్రబాబు. పవన్ చేస్తున్న ఆరోపణలే. అసలు మూడు రాజధానులను కడతానని జగన్ ఎప్పుడు చెప్పలేదు.

Advertisement
Update: 2024-01-22 05:39 GMT

జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక కూటమిలో కొత్త శత్రువు చేరారు. ఇక్కడ కూటమి అంటే పొత్తులు పెట్టుకున్న రాజకీయపార్టీలు కావు. అచ్చంగా జగన్ వ్యతిరేకులని మాత్రమే. జగన్ పైన యుద్ధం చేయటానికి వ్యతిరేకుల జాబితాలో తాజాగా చెల్లెలు వైఎస్ షర్మిల కూడా చేరారు. విజయవాడలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే సోదరుడిపైన షర్మిల అడ్డదిడ్డమైన ఆరోపణలు చేశారు. అప్పులు రూ. 10 లక్షలకు చేరుకున్నాయన్నారు. మూడు రాజధానులని చెప్పి ఒక్కటైనా కట్టారా..? అని నిలదీశారు.

ప్రత్యేకహోదాను కేంద్రానికి తాకట్టుపెట్టేసినట్లు మండిపడ్డారు. ఒక్క పరిశ్రమను కూడా తేలేకపోయారంటూ బురదచల్లేశారు. కాకపోతే ఒకటిరెండు విషయాల్లో జగన్+చంద్రబాబు ఇద్దరినీ కలిపారు. ప్రత్యేకహోదా సాధించటంలో జగన్, చంద్రబాబు ఇద్దరు ఫెయిలైనట్లు మండిపడ్దారు. కేంద్రాన్ని నిలదీయటంలో జగన్, చంద్రబాబు భయపడుతున్నట్లు ధ్వజమెత్తారు. ఇవి మినహా మిగిలిన విషయాల్లో జగన్నే తప్పుపట్టారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. రాష్ట్రం అప్పులు రూ.10 లక్షల కోట్లని ఇంతకాలం చంద్రబాబు, పవన్ కల్యాణ్, దగ్గుబాటి పురందేశ్వరి, ఎల్లోమీడియా చెప్పిన లెక్క‌లే షర్మిల కూడా చెప్పారు.

అలాగే మూడు రాజధానులని చెప్పిన జగన్ ఒక్కటైనా కట్టారా అంటు ఎద్దేవాచేశారు. ఇది కూడా చాలాకాలంగా చంద్రబాబు. పవన్ చేస్తున్న ఆరోపణలే. అసలు మూడు రాజధానులను కడతానని జగన్ ఎప్పుడు చెప్పలేదు. బాగా డెవలప్ అయిన వైజాగ్ ను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేసుకుంటానన్నారు. కర్నూలును న్యాయరాజధానిగా చేస్తానని చెప్పారు. అమరావతిలో శాసనరాజధాని కంటిన్యూ అవుతుందన్నారు.

పై మూడింటిలో రాజధానులను కడతానని ఎక్కడుందసలు. చంద్రబాబు, పవన్ కు లాగే షర్మిలకు కూడా బుర్రపనిచేయటం లేదా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. పై ఇద్దరిలాగే జగన్ పైన ఏదో బురదచల్లేయాలన్న ఆలోచనతోనే షర్మిల కూడా అప్పులు, మూడు రాజధానులు, ప్రత్యేకహోదా సాధనలో ఫెయిలని అన్నట్లుగా ఉంది. ప్రత్యేక హోదా వద్దు ప్రత్యేక ప్యాకేజి చాలని చంద్రబాబు కేంద్రప్రభుత్వం దగ్గర ఒప్పుకున్న తర్వాత జగన్ ఏమి చేయగలరు..? రాష్ట్రం అప్పులో చంద్రబాబు హయాంలో జరిగిన అప్పును షర్మిల ఎందుకు ప్రస్తావించటంలేదు..? మొత్తానికి అర్ధ‌సత్యాలు పలకటంలో జగన్ శత్రువ‌ర్గంలో షర్మిల కూడా చేరిపోయినట్లు అర్థ‌మవుతోంది.

Tags:    
Advertisement

Similar News