షర్మిల ట్రాప్‌లో వైసీపీ పడిందా..?

జగన్ లేదా వైసీపీ ముఖ్యనేతలను రెచ్చగొట్టడమే షర్మిల టార్గెట్ గా పెట్టుకున్నారు. అందుకనే నోటికొచ్చింది మాట్లాడేశారు. ఎన్నికల్లోపు జగన్‌ను, వైసీపీని టార్గెట్ చేస్తూ ఇంకా రచ్చరచ్చ చేయటం ఖాయం

Advertisement
Update:2024-01-24 11:42 IST

గొప్ప మేధావులం అనుకునే వాళ్ళు కూడా ఒక్కోసారి తప్పులు చేస్తుంటారు. ఇప్పుడు వైసీపీ పెద్దలు కూడా అలాంటి తప్పేచేశారు. ఇంతకీ వాళ్ళు చేసిన తప్పు ఏమిటంటే.. వైఎస్ షర్మిల ట్రాపులో పడటమే. ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా బాధ్యతలు తీసుకోగానే సోదరుడు జగన్మోహన్ రెడ్డిపైన నోటికొచ్చింది మాట్లాడారు. జగన్ రెడ్డి అని సంబోధించటమే కాకుండా క్రిస్టియన్ల ముందు జగన్‌ను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేశారు. పైగా జగన్ రెడ్డి అంటూ రెచ్చగొట్టేట్లుగా మాట్లాడారు. టార్చిలైటు వేసినా ఏపీలో అభివృద్ధి అన్నదే కనబడదని సెటైర్లు వేశారు.

జగన్‌ను జగన్ రెడ్డన్నా, టార్చిలైట్లు వేసినా ఏపీలో అభివృద్ధి కనబడటంలేదని చెప్పినా, మణిపూర్‌లో క్రిస్టియన్లపై దాడులు చేసి చర్చిలను కూల్చేశారని అనటం ఒక వ్యూహంప్రకారమే మాట్లాడారు. జగన్ లేదా వైసీపీ ముఖ్యనేతలను రెచ్చగొట్టడమే షర్మిల టార్గెట్ గా పెట్టుకున్నారు. అందుకనే నోటికొచ్చింది మాట్లాడేశారు. ఎన్నికల్లోపు జగన్‌ను, వైసీపీని టార్గెట్ చేస్తూ ఇంకా రచ్చరచ్చ చేయటం ఖాయం.

ఇలా రెచ్చగొట్టడంలో షర్మిల ఉద్దేశ్యం ఏమిటంటే.. ప్రచారంలో ఉండటమే. జగన్ పైన తాను ఎంత మాట్లాడితే, వైసీపీ వాళ్ళు కౌంటరుగా అంత రెచ్చిపోతే, ఎల్లోమీడియా తనకు అంత ప్రచారం ఇస్తుందని షర్మిలకు బాగా తెలుసు. అందుకనే అచ్చంగా ప్రచారం కోసమే షర్మిల నోటికొచ్చింది మాట్లాడుతున్నారు. దాన్ని అర్థంచేసుకోకుండా వైవీ సుబ్బారెడ్డి, రాచమల్లు శివప్రసాదరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తమతో వస్తే జరిగిన అభివృద్ధిని చూపిస్తామంటూ షర్మిలను ఛాలెంజ్ చేశారు. వైవీ సుబ్బారెడ్డి ఛాలెంజ్ కు షర్మిల రిప్ల‌య్ ఇస్తూ డేట్, టైమ్ చెప్పమన్నారు.

జరిగిన అభివృద్ధిని చూడటానికి తనతో పాటు ప్రతిపక్షాలు, మీడియా అంతా సిద్ధమని షర్మిల స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు వైవీ ఏమిచేయాలి..? షర్మిలకు టైమ్‌, డేట్ చెప్పి ప్రతిపక్షాలతో పాటు ఎల్లోమీడియాను తీసుకెళ్ళాలా..? లేకపోతే అసలు షర్మిలను పూర్తిగా ఇగ్నోర్ చేయాలా..? షర్మిల విషయంలో ఏమిచేస్తే బాగుంటుందనే విషయమై వైసీపీ ముఖ్యనేతలు ముందు ఒక నిర్ణయానికి రావాలి. లేకపోతే అనాలోచితంగా షర్మిల ట్రాప్‌లోపడి గిలగిల్లాడాల్సిందే.

Tags:    
Advertisement

Similar News