తిరుపతి జనసేనలో అసమ్మతి చల్లారినట్టేనా?

పార్టీపై తమ అసంతృప్తిని బాహాటంగానే వెల్లడించారు. గో బ్యాక్ ఆరణి శ్రీనివాసులు..అంటూ తిరుపతి నగరమంతా ఫ్లెక్సీలు వేయించారు. నిన్న తిరుపతి నగరంలోని ఓ హోటల్లో టీడీపీ నాయకులతో హరి ప్రసాద్, కిరణ్ రాయల్ ఓ సమావేశం నిర్వహించారు.

Advertisement
Update: 2024-03-15 10:11 GMT

పొత్తులో భాగంగా తిరుపతి అసెంబ్లీ సీటు తమకు ఇవ్వాలని జనసేన ఎప్పటినుంచో కోరుతున్న సంగతి తెలిసిందే. టీడీపీ కూడా అందుకు సుముఖంగా ఉండటంతో టికెట్ తమకేనని ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్, తిరుపతి జనసేన ఇన్‌చార్జి కిరణ్ రాయల్ భావిస్తూ వచ్చారు.

అయితే పొత్తులో భాగంగా తిరుపతి సీటు జనసేనకే దక్కగా.. పవన్ కళ్యాణ్ అనూహ్యంగా వైసీపీ నుంచి వచ్చిన చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుకు టికెట్ కేటాయించారు. దీంతో ఇన్నాళ్లు తిరుపతి టికెట్ తమకే అని భావిస్తూ వచ్చిన హరి ప్రసాద్, కిరణ్ రాయల్ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు.

పార్టీపై తమ అసంతృప్తిని బాహాటంగానే వెల్లడించారు. గో బ్యాక్ ఆరణి శ్రీనివాసులు..అంటూ తిరుపతి నగరమంతా ఫ్లెక్సీలు వేయించారు. నిన్న తిరుపతి నగరంలోని ఓ హోటల్లో టీడీపీ నాయకులతో హరి ప్రసాద్, కిరణ్ రాయల్ ఓ సమావేశం నిర్వహించారు. ఆరణికి మద్దతు ఇవ్వొద్దని తీర్మానించుకున్నారు. ఇవాళ మరోసారి ఆత్మీయ సమావేశం నిర్వహించి ఆరణికి వ్యతిరేకంగా నడుచుకోవడంపై చర్చించాలని నిర్ణయించారు.

అయితే పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా టీడీపీ, జనసేన నాయకులు సమావేశం నిర్వహించడంపై ఆ రెండు పార్టీల అధిష్టానాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తనకెంతో సన్నిహితంగా మెలుగుతూ వ్యక్తిగత రాజకీయ కార్యదర్శిగా ఉంటూ పార్టీకి వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తున్న పసుపులేటి హరిప్రసాద్ పై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో ఇవాళ నిర్వహించదలచిన ఆత్మీయ సమావేశాన్ని టీడీపీ, జనసేన పార్టీలు రద్దు చేసుకున్నాయి.

పవన్ కళ్యాణ్ తనపై సీరియస్ అయిన నేపథ్యంలో పసుపులేటి హరిప్రసాద్ ఇవాళ సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు. పవన్ మాటలను వేదంగా భావించి ఆయన వెంట నడవాలని పార్టీ శ్రేణులను కోరారు. పవన్ కళ్యాణ్ ఆదేశాలను ప్రతి ఒక్కరూ శిరసా వహించాలని సూచించారు. తిరుపతి జనసేన అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసుల్ని పవన్ కళ్యాణ్ ప్రకటించారని, ఆయన మాటను వేదంగా భావించి ఆరణిని అఖండ మెజారిటీతో గెలిపించాలని జనసేన శ్రేణులను పసుపులేటి హరిప్రసాద్ కోరారు. 

Tags:    
Advertisement

Similar News