కాపులు పవన్‌ వెంట వచ్చేది చంద్రబాబు అధికారం కోసం కాదు

చంద్రబాబు, పవన్‌ల భేటీపై ఎల్లోమీడియాలో వచ్చిన కథనాలపై జోగయ్య తన లేఖలో స్పందించారు. జనసేనకు 30 లేదా 27 సీట్లంటూ ఏకపక్షమైన వార్తలను ఎల్లో మీడియా ఎవరిని ఉద్ధరించడానికి రాస్తోందని ఆయన ప్రశ్నించారు.

Advertisement
Update: 2024-02-05 10:30 GMT

కాపులు పవన్ క‌ల్యాణ్ వెంట వచ్చేది చంద్రబాబు అధికారం కోసం కాదని కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు, మాజీ మంత్రి హరిరామజోగయ్య స్పష్టం చేశారు. దామాషా ప్రకారం సీట్ల కేటాయింపు లేకపోతే రాష్ట్ర ప్రయోజనాలు ఎలా కాపాడతారని ఆయన ప్రశ్నించారు. రెండున్నరేళ్లు పవన్‌ సీఎంగా ఉంటారనే మాట చంద్రబాబుతో చెప్పించి తీరాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన పవన్‌కు పలు ప్రశ్నలు సూటిగా సంధిస్తూ లేఖ రాశారు. ఈ లేఖను పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో విడుదల చేశారు.

ఎల్లో మీడియా రాతలు ఎవరిని ఉద్ధరించడానికి?

చంద్రబాబు, పవన్‌ల భేటీపై ఎల్లోమీడియాలో వచ్చిన కథనాలపై జోగయ్య తన లేఖలో స్పందించారు. జనసేనకు 30 లేదా 27 సీట్లంటూ ఏకపక్షమైన వార్తలను ఎల్లో మీడియా ఎవరిని ఉద్ధరించడానికి రాస్తోందని ఆయన ప్రశ్నించారు. వైసీపీని రాజ్యాధికారం నుంచి తప్పించడం అంటే టీడీపీకి రాజ్యాధికారం కట్టబెట్టడం మాత్రమే కాదని, అసలు కాపు సామాజిక వర్గం పవన్‌ కల్యాణ్‌తో కలిసి ప్రయాణం చేస్తున్నది ఈ ఆలోచనతో కాదనే విషయాన్ని గుర్తించాలని లేఖలో జోగయ్య తేల్చిచెప్పారు. జనసేన సపోర్ట్‌ లేకుండా టీడీపీ అధికారంలోకి రావడం కష్టమని, అందుకు 2019 ఫలితాలే ఉదాహరణ అని ఆయన స్పష్టం చేశారు.

40 నుంచి 60 సీట్ల మధ్య పోటీచేసి తీరాలి...

జనసేన 40 నుంచి 60 సీట్ల మధ్య తప్పకుండా పోటీచేసి తీరాలని జోగయ్య పవన్‌కు ఈ లేఖ ద్వారా మరోమారు సూచించారు. 175 సీట్లు ఉన్న రాష్ట్రంలో 50 సీట్లయినా దక్కించుకోగలిగితేనే రాజ్యాధికారం సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు. అధికారం అంతా చంద్రబాబుకే ధారబోసి మీరు కలలు కంటున్న రాష్ట్ర ప్రయోజనాలు ఎలా సాధ్యమవుతాయంటూ పవన్‌ కల్యాణ్‌ను ప్రశ్నించారు. జన సైనికులు సంతృప్తి పడేలా సీట్ల పంపకం జరగకపోయినా.. ముఖ్యమంత్రి పదవి రెండున్నర సంవత్సరాలైనా కట్టబెడతామని చంద్రబాబు నోటి వెంట ఎన్నికల ముందే ప్రకటించగలుగుతారా అని జోగయ్య తన లేఖలో నిలదీశారు.

Tags:    
Advertisement

Similar News