9 చోట్ల ధ్వంసం చేస్తే.. ఒక వీడియోనే బయటకొస్తుందా..?

టీడీపీ రిగ్గింగ్ చేసిన చోట్ల రీపోలింగ్ పెట్టాల్సిందేనన్నారు అనిల్. ఈసీ తీరుపై న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు.

Advertisement
Update: 2024-05-23 10:42 GMT

ఈసీ, పోలీసులు.. టీడీపీతో కుమ్మక్కయ్యారని మండిపడ్డారు మాజీ మంత్రి, నర్సరావుపేట వైసీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్. 9 చోట్ల ఈవీఎంలు ధ్వంసమయ్యాయని సాక్షాత్తూ ఈసీ ప్రకటించిందని, మరి కేవలం ఎమ్మెల్యే పిన్నెల్లి వీడియోనే ఎందుకు బయటకొచ్చిందని ప్రశ్నించారు. మిగతా వీడియోలు కూడా బయటపెట్టాలని డిమాండ్ చేశారాయన.


రిగ్గింగ్ చేశారు..

ఈ ఎన్నికల్లో పల్నాడు ప్రాంతంలో ఎక్కడా లేనంతగా దారుణాలు జరిగాయని ఆరోపించారు అనిల్. వైసీపీ నేతల ఫిర్యాదుల్ని జిల్లా ఎస్పీ కనీసం పట్టించుకోలేదన్నారు. సాక్షాత్తూ ఎమ్మెల్యే పిన్నెల్లి తన ఓటు వేసేందుకు కూడా ఇబ్బంది పడాల్సి వచ్చిందన్నారు. పిన్నెల్లి సోదరుల్ని పోలింగ్ బూత్ ల వద్దకు రానివ్వలేదని చెప్పారు. చాలా చోట్ల రిగ్గింగ్ లు జరిగాయని ఆయా పోలింగ్ బూత్ లలోని ఫుటేజీలు కూడా బయటపెట్టాలన్నారు అనిల్. తుమ్మురుకోట, వబుచెర్లలో ఈవీఎంలు ధ్వంసమయ్యాయని, చింతపల్లిలో టీడీపీ నేతలు రిగ్గింగ్ చేశారని చెప్పారు. జిల్లా మొత్తం కలియదిరిగిన ఎస్పీ, పాల్వాయిగేటు సహా మరో మూడు ప్రాంతాలకు రాలేదని, కావాలనే అక్కడ రిగ్గింగ్ కి అవకాశం కల్పించారన్నారు అనిల్.

రీపోలింగ్ పెట్టాల్సిందే..

టీడీపీ రిగ్గింగ్ చేసిన చోట్ల రీపోలింగ్ పెట్టాల్సిందేనన్నారు అనిల్. ఈసీ తీరుపై న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. పోలీసులు కూడా టీడీపీ నేతలతో కుమ్మక్కయ్యారని, ఉద్దేశపూర్వకంగానే అల్లర్లకు అవకాశమిచ్చారని అన్నారు. 

Tags:    
Advertisement

Similar News