శివుడు రమ్మని పిలుస్తున్నాడంటూ.. కళాశాల విద్యార్థి ఆత్మహత్య

ప్ర‌కాశం జిల్లాలోని పెద్దారవీడు మండలం చాట్లమడ గ్రామానికి చెందిన శేఖర్ రెడ్డి చెన్నైలోని ఒక ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు.

Advertisement
Update: 2022-09-27 07:30 GMT

మూఢనమ్మకాలు, అతి విశ్వాసాలు ప్రాణాలను బలిగొంటున్నాయి. సమాజం ఎంత అభివృద్ధి చెందుతున్నా ఈ మూఢనమ్మకాల జాడ్యం మాత్రం వీడటం లేదు. ఆ మధ్య మదనపల్లెలో పాఠశాలను నిర్వహిస్తున్న విద్యాధికులైన దంపతులు మూఢనమ్మకాలతో దేవుడికి బలి ఇస్తే మళ్లీ తిరిగి వస్తారని నమ్మి తమ ఇద్దరు కూతుళ్ళను చంపుకొన్నారు. తాజాగా ప్రకాశం జిల్లాలో తనను శివుడు పిలుస్తున్నాడంటూ ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన సంచలనం సృష్టించింది.

ప్ర‌కాశం జిల్లాలోని పెద్దారవీడు మండలం చాట్లమడ గ్రామానికి చెందిన శేఖర్ రెడ్డి చెన్నైలోని ఒక ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. కాగా ఇటీవల కళాశాలకు సెలవులు ఇవ్వడంతో అతడు స్వగ్రామానికి వచ్చాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో శేఖర్ రెడ్డి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలన చేయ‌గా వారికి ఒక సూసైడ్ నోట్ లభించింది.

అందులో ' నేను పిరికి వాడిని కాదు. ఈ పాడు సమాజంలో ఉండవద్దని శివుడు చెప్పాడు. అందుకే సూసైడ్ చేసుకుంటున్నా. నా చావుకు ఎవరూ కారణం కాదు. ప్రేమ వంటి వ్యవహారాలు లేవు.' అని శేఖర్ రెడ్డి రాసి పెట్టాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మూఢనమ్మకాలతో యువకుడు ప్రాణం తీసుకున్న సంఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది.

Tags:    
Advertisement

Similar News