పిన్నెల్లి విషయంలో తప్పు ఎన్నికల కమిషన్ దేనా..?

ఇన్ని రోజులు ఈ విషయాన్ని నాన్చి నాన్చి ఇప్పుడు బయటపెట్టడంతో రెండు పార్టీలకు ఈసీ టార్గెట్ గా మారింది. టీడీపీతో కుమ్మక్కయ్యారని వైసీపీ వాళ్లు అంటుంటే, వైసీపీ తప్పుల్ని కప్పిపుచ్చారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

Advertisement
Update: 2024-05-23 02:25 GMT

- ఈనెల 13న ఏపీలో ఎన్నికలు జరిగాయి, ఆరోజు ఎమ్మెల్యే పిన్నెల్లి ఈవీఎంను పగలగొట్టారని అంటున్నారు. మరి అదే రోజు వెబ్ క్యాస్టింగ్ లో ఆ వీడియో చూసిన అధికారులు ఏం చేశారు..?

- ఎన్నికల రోజు ఆ వీడియో బయటకు రాలేదంటే అధికారులు వైసీపీతో కుమ్మక్కయ్యారని టీడీపీ ఆరోపిస్తోంది..

- ఎన్నికలు జరిగిన 8 రోజుల తర్వాత ఆ వీడియో లోకేష్ ట్విట్టర్లోకి ఎలా వచ్చిందని వైసీపీ అడుగుతోంది..

అసలు ఎన్నికల కమిషన్, పోలీస్ అధికారులు ఏ పార్టీకి అనుకూలంగా ప్రవర్తించారు, ఎవరి తప్పుల్ని కప్పిపుచ్చాలని చూశారు, చివరికి ఈవీఎం ధ్వంసం ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారాక.. ఇప్పుడు పిన్నెల్లిని అరెస్ట్ చేయాలంటూ ఎందుకు హడావిడి పడుతున్నారు.


ఎన్నికల రోజు ఈవీఎంని పగలగొట్టినట్టు ఈసీ అధికారులకు సమాచారం ఉంది. మరి అప్పుడే పిన్నెల్లిని ఎందుకు అరెస్ట్ చేయలేదు..? హౌస్ అరెస్ట్ నుంచి ఆయన తప్పించుకోడానికి ఎవరైనా సాయం చేశారా..? మీడియా ఛానెళ్లు నేరుగా ఆయన వద్దకే వెళ్లి ఇంటర్వ్యూలు తీసుకుంటున్నా.. పోలీసులకు ఆయన జాడ తెలియకపోవడం విశేషమే కదా..? ఈ ప్రశ్నలకు ఈసీ, పోలీసులు సమాధానం చెప్పాలి. ఇన్ని రోజులు ఈ విషయాన్ని నాన్చి నాన్చి ఇప్పుడు బయటపెట్టడంతో రెండు పార్టీలకు ఈసీ టార్గెట్ గా మారింది. టీడీపీతో కుమ్మక్కయ్యారని వైసీపీ వాళ్లు అంటుంటే, వైసీపీ తప్పుల్ని కప్పిపుచ్చారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మొత్తానికి ఈ వ్యవహారంలో ఏపీ ఎన్నికల అధికారులదే తప్పు అని ప్రాథమికంగా తెలుస్తోంది.


తప్పు జరిగినప్పుడే దానిపై చర్యలు తీసుకుని ఉంటే ఇంత రాద్ధాంతం జరిగేది కాదు. టీడీపీ నేతలు రిగ్గింగ్ చేసినా, పిన్నెల్లి ఈవీఎం పగలగొట్టినా.. అప్పటికప్పుడు పోలీసులు కేసులు నమోదు చేసి, అరెస్ట్ లు చేసి ఉంటే వ్యవహారం ఇక్కడిదాకా వచ్చేది కాదు. తప్పు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న పిన్నెల్లి ఇంకా పోలీసులకు దొరకలేదు, అటు రిగ్గింగ్ చేశారంటున్న టీడీపీ నేతలపై కేసులు లేవు, కనీసం ఆ వీడియోలు కూడా బయటకు రావడంలేదు. దీంతో మాచర్ల వ్యవహారం పూర్తిగా గందరగోళంగా మారింది. ఏపీ ఎన్నికల్లో అరుదైన ఘట్టంగా మిగిలింది. 

Tags:    
Advertisement

Similar News