పాల్వాయి పోలింగ్‌ బూత్‌ సిబ్బందిపై వేటు.. పిన్నెల్లి ఘటనతో ఈసీ చర్యలు

పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించిన స్థానిక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేస్తున్నా అడ్డుకోకపోవడం, ఆయన పోలింగ్ కేంద్రంలోకి అడుగుపెట్టగానే లేచి నిలబడి నమస్కరించినట్లు సీసీ ఫుటేజీలో రికార్డయింది.

Advertisement
Update: 2024-05-23 03:12 GMT

వివాదాస్పదంగా మారిన పల్నాడు జిల్లా రెంటచింతల మండలం పాల్వాయి గేటు పోలింగ్‌ సిబ్బందిపై వేటు వేసింది ఎలక్షన్ కమిషన్. విధుల్లో నిర్లక్ష్యం, నిబంధనలకు విరుద్ధంగా న‌డుచుకున్నార‌న్న అభియోగాలతో పోలింగ్ కేంద్రం పీవో, సిబ్బందిని సస్పెండ్ చేసినట్లు సమాచారం.

ఈ నెల 13న పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించిన స్థానిక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేస్తున్నా అడ్డుకోకపోవడం, ఆయన పోలింగ్ కేంద్రంలోకి అడుగుపెట్టగానే లేచి నిలబడి నమస్కరించినట్లు సీసీ ఫుటేజీలో రికార్డయింది. దీంతో ఈ పోలింగ్ సెంటర్‌లోని మొత్తం సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేసింది. ఇప్పటివరకూ ఘటనకు సంబంధించి పీవో నుంచి సరైన సమాధానం రాలేదని ఈసీ పేర్కొంది. ఇక మిగతా సిబ్బందిని సంజాయిషీ కోరింది ఈసీ.

రెండు రోజుల క్రితం స్థానిక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం పగలగొట్టిన వీడియో బయటకు రావడంతో వివాదం మొదలైంది. ఇప్పటికే ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఈసీ.. పిన్నెల్లి అరెస్టుకు ఆదేశించింది. వైసీపీ మాత్రం పూర్తి వీడియోను బయటపెట్టాలని డిమాండ్ చేస్తోంది. పాల్వాయి గేటు పోలింగ్ బూత్‌ను తెలుగుదేశం పార్టీ క్యాప్చరింగ్ చేసి ఓట్లు వేసుకుందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అదే పోలింగ్ బూత్‌ బయట వైసీపీ కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడి చేసిన వీడియోలను రిలీజ్ చేశారు. ఈ వీడియోలపై ఈసీ స్పందించకపోవడం గమనార్హం. ఈసీ అధికారులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News