ఈ నియోజకవర్గాల్లో గెలుపు టీడీపీకి కష్టమేనా?

వైసీపీ ఏర్పాటైన దగ్గర నుండి ఎస్సీ, ఎస్టీ, ముస్లింలు సాలిడ్‌గా జగన్‌కే మద్దతుగా నిలబడ్డారు. చరిత్రను బట్టి వచ్చే ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాల్లో టీడీపీ గెలుపు కష్టమనే అనిపిస్తోంది.

Advertisement
Update: 2022-10-22 07:36 GMT

వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 160 నియోజకవర్గాల్లో గెలుస్తుందని చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడు చెబుతున్నది పెద్ద జోక్‌గా తయారైంది. జగన్మోహన్ రెడ్డి 175కి 175 నియోజకవర్గాల్లోను వైసీపీ గెలవాల్సిందే అని పదేపదే చెబుతున్న విషయం అందరికీ తెలిసిందే. జగన్ 175 నియోజకవర్గాల్లో గెలవాలని చెబుతున్నారు కాబట్టి చంద్రబాబు కూడా 160 నియోజకవర్గాల్లో గెలుస్తుందని చెబుతున్నట్లే ఉంది.

జగన్ చెబుతున్నట్లుగా వైసీపీ 175 సీట్లు గెలవటానికి అవకాశలున్నాయేమో కానీ చంద్రబాబు చెబుతున్నట్లు 160 నియోజకవర్గాల్లో గెలుపు ఏమాత్రం సాధ్యంకాదు. ఎందుకంటే 151 ఎమ్మెల్యేలను గెలుచుకున్న వైసీపీ వచ్చే ఎన్నికల్లో 175కి చేరుకునే అవకాశముంది కానీ 23 సీట్ల నుంచి 160 సీట్లకు రావటం టీడీపీ కష్టమే. ఇదే సమయంలో గడచిన రెండు ఎన్నికల్లో రిజర్వుడు నియోజకవర్గాల్లో గెలుపు టీడీపీకి పెద్ద సమస్యగా మారిపోయింది.

ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాలు రాష్ట్రంలో 36 ఉన్నాయి. ఇందులో ఎస్సీ నియోజకవర్గాలు 29 కాగా ఎస్టీలకు కేటాయించిన నియోజకవర్గాలు ఏడు. ఈ 36 నియోజకవర్గాల్లో ప్రస్తుతం టీడీపీ తరపున ఉన్నది ఒకే ఒక ఎస్సీ నియోజకవర్గం మాత్రమే. ప్రకాశం జిలాలోని కొండపి నియోజకవర్గంలో డోలా బాలవీరాంజనేయస్వామి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మిగిలిన 35 నియోజకవర్గాల్లోను వైసీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఈ నియోజకవర్గాల్లో కూడా 7 ఎస్టీ నియోజకవర్గాల్లో గడచిన రెండు ఎన్నికల్లో టీడీపీ తరపున ఒక్కరంటే ఒక్కరు కూడా గెలవలేదు.

ఈ నియోజకవర్గాలను పక్కనపెట్టేస్తే రెండు ఎన్నికల్లో టీడీపీ తరపున ఒక్క ముస్లిం అభ్యర్ధి కూడా ఎక్కడా గెలవలేదు. రెండు ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీచేస్తున్న ముస్లిం నేతలే గెలుస్తన్నారు. అంటే సుమారు 40 నియోజకవర్గాల్లో గెలుపు తెలుగుదేశం పార్టీకి చాలా కష్టంగా తయారైందని అర్ధమైపోతోంది. వైసీపీ ఏర్పాటైన దగ్గర నుండి ఎస్సీ, ఎస్టీ, ముస్లింలు సాలిడ్‌గా జగన్‌కే మద్దతుగా నిలబడ్డారు. చరిత్రను బట్టి వచ్చే ఎన్నికల్లో పై సామాజికవర్గాల్లో టీడీపీ సీట్లు గెలుచుకోవటం కష్టమనే అనిపిస్తోంది. దాంతో వైసీపీ ఖాతాలో పడే ఎమ్మెల్యేల‌ సంఖ్య తక్కువలో తక్కువ 35 నుంచి మొదలవుతుందని చెప్పచ్చు. మరి వచ్చే ఎన్నికల్లో ఏమవుతుందో చూడాల్సిందే.

Tags:    
Advertisement

Similar News