సీఎంతో సూపర్ అనిపించుకున్న రజిని, బొత్స

రాయలసీమకు చెందిన ఒక మహిళా మంత్రి పదేపదే వివాదాల్లో చిక్కుకుంటుండటంపైనా జగన్ సీరియస్ అయ్యారు. శాఖ పరమైన అంశాలపై కాకుండా ఇతర అంశాల్లో జోక్యం ఎక్కువగా ఉంటోందని మహిళా మంత్రికి జగన్‌ క్లాస్ తీసుకున్నారు.

Advertisement
Update: 2023-02-09 03:15 GMT

ఏపీ కేబినెట్‌ భేటీలో కొందరు మంత్రులకు జగన్‌ క్లాస్ తీసుకున్నారు. మరికొందరికి జగన్‌ నుంచి ప్రశంసలు అందాయి. మంత్రి జోగి రమేష్‌పై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గృహనిర్మాణం విషయంలో లబ్దిదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదని మంత్రి విశ్వరూప్ వివరించారు. ఆ సమయంలోనే గృహ నిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్ తీరుపై జగన్ అసహనం వ్యక్తం చేశారు.

ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి ఎందుకు తీసుకురావడం లేదని మంత్రిని ప్రశ్నించారు. పనిలో పనిగా పక్క నియోజకవర్గాల్లో జోగి రమేష్ జోక్యంపైనా సీఎం సీరియస్‌ అయ్యారు. ఎందుకు లేని వివాదాలను సృష్టిస్తున్నారని ప్రశ్నించారు. శాఖపై దృష్టి పెట్టాలని సూచించారు.

రాయలసీమకు చెందిన ఒక మహిళా మంత్రి పదేపదే వివాదాల్లో చిక్కుకుంటుండటంపైనా జగన్ సీరియస్ అయ్యారు. శాఖ పరమైన అంశాలపై కాకుండా ఇతర అంశాల్లో జోక్యం ఎక్కువగా ఉంటోందని మహిళా మంత్రికి జగన్‌ క్లాస్ తీసుకున్నారు. మీ కారణంగా ప్రభుత్వం ఇరుకునపడుతోందని, అనవసరమైన అంశాలను పక్కనపెట్టి శాఖపై పట్టు సాధించాలని సూచించారు.

ప్రతిపక్షాలు, మీడియా చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టే విషయంలో ముగ్గురు మంత్రులను జగన్ మెచ్చుకున్నారు. ప్రభుత్వంపై విమర్శలను తిప్పికొట్టే విషయంలో బొత్స సత్యనారాయణ అందరి కంటే ముందుంటున్నారని సీఎం వ్యాఖ్యానించారు. విడదల రజిని, కారుమూరి నాగేశ్వరరావు కూడా ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను బాగా వివరిస్తున్నారని కితాబిచ్చారు. ఈ ముగ్గురిని చూసి మిగిలిన మంత్రులు కూడా స్పూర్తి పొందాలని సీఎం పిలుపునిచ్చారు.

Tags:    
Advertisement

Similar News