పేదల ఇళ్లే ప్రథమ కర్తవ్యం.. ప్రతిపక్షాల కుట్రలు సాగవు

విశాఖలో ఇళ్ల నిర్మాణం నిర్దేశిత సమయంలోగా పూర్తికావాలని సూచించారు సీఎం జగన్. డిసెంబర్‌ లోగా విశాఖలో ఇళ్లు పూర్తిచేయడానికి తగిన కార్యచరణ రూపొందించాలన్నారు.

Advertisement
Update: 2023-07-06 12:11 GMT

ఎన్నికల టైమ్ దగ్గరపడేకొద్దీ సంక్షేమ పథకాల అమలుపై సీఎం జగన్ పూర్తి స్థాయిలో దృష్టిపెట్టారు. నవరత్నాల్లో ముఖ్యమైనది, ప్రజలకు అత్యంత ఎక్కువ మేలు చేసేది అయిన పేదలందరికీ ఇళ్లు పథకాన్ని పూర్తి స్థాయిలో నెరవేర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. పేదలందరికీ ఇళ్లు అనే పథకంలో కేవలం భూమి ఇచ్చి వదిలిపెట్టకుండా, వారికి ఇంటి నిర్మాణం కూడా ప్రభుత్వమే చేపడుతోంది. దీంతో ఇది కాస్త ఆలస్యమవుతోంది. అయితే కేటాయింపులు పెంచి, ఎన్నికలనాటికి లబ్ధిదారుల కళ్లలో ఆనందం చూడాలంటున్నారు జగన్. ఎన్నికలకు బ్రహ్మాస్త్రంగా ఈ పథకాన్ని ఉపయోగించుకోవాలనుకుంటున్నారు.

తాజాగా గృహనిర్మాణాశాఖపై క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు సీఎం జగన్. ఈ సందర్భంగా ఆయనకు గృహనిర్మాణంపై వివరాలు అందించారు అధికారులు. ఇప్పటి వరకు ఏపీలో 4,24,220 ఇళ్లు పూర్తయ్యాయని, ఆగస్టు 1 నాటికి 5 లక్షల ఇళ్లు పూర్తవుతాయని వెల్లడించారు అధికారులు. రూఫ్‌ లెవల్, ఆ పైస్థాయిలో నిర్మాణంలో ఉన్న ఇళ్లు 5,68,517 కాగా, వివిధ స్థాయిల్లో నిర్మాణ దశలో ఉన్న ఇళ్లు 9,56,369 అని తెలిపారు.. ఈ అర్థిక సంవత్సరంలో గృహనిర్మాణం కోసం రూ.2201 కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. ప్రభుత్వం నిర్మించి ఇస్తున్న కాలనీలు పూర్తవుతున్నకొద్దీ, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. కోర్టు కేసులు కారణంగా ఇళ్లస్థలాల పంపిణీ నిలిచిపోయిన చోట ప్రత్యామ్నాయ భూముల సేకరణపై దృష్టి పెట్టాలని సూచించారు.

డెడ్ లైన్ డిసెంబర్..

విశాఖలో ఇళ్ల నిర్మాణం నిర్దేశిత సమయంలోగా పూర్తికావాలని సూచించారు సీఎం జగన్. వీలైనంత త్వరగా అక్కడ పేదలకు నివాసం కల్పించడానికి చర్యలు వేగవంతం చేయాలన్నారు. డిసెంబర్‌ లోగా విశాఖలో ఇళ్లు పూర్తిచేయడానికి తగిన కార్యచరణ రూపొందించాలన్నారు. కొత్తగా ఇళ్లకోసం దరఖాస్తు చేసుకున్నవారికి పట్టాలు ఇచ్చేందుకు భూములను సేకరించాలని ఆదేశించారు. సీఆర్డీఏ పరిధిలో పేదలకు ఇళ్లు రానివ్వకూడదని కొంతమంది నిరంతరం అడ్డంకులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు సీఎం జగన్. పేదవాళ్ల కడుపు కొట్టడానికి అందరూ ఏకం అవుతున్నారని చెప్పారు. పేదలకు ఇళ్లు రాకూడదన్నదే వారి ఆలోచన అని అన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా, గట్టి సంకల్పంతో ఇళ్ల నిర్మాణం పూర్తిచేయాలని, దానికోసం న్యాయపరమైన చర్యలన్నీ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు జగన్.

టిడ్కో ఇళ్లపై సమీక్ష..

మరోవైపు టిడ్కో ఇళ్లపైనా సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. టిడ్కో ఇళ్ల వద్ద వాణిజ్య సముదాయాల ఏర్పాటుకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తొలిదశలో 15 టిడ్కో కాలనీల్లో షాపింగ్ కాంప్లెక్స్ లు నిర్మిస్తారు. ఇప్పటి వరకు టిడ్కో గృహసముదాయాల వద్ద ఎలాంటి వ్యాపారాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఇప్పుడు ప్రభుత్వమే అక్కడ వ్యాపార సముదాయాలు ఏర్పాటు చేయాలని చూస్తోంది. టిడ్కో ఇళ్లపై సోలార్‌ ప్యానెల్స్‌ ఏర్పాటుకి కూడా సీఎం జగన్ అంగీకరించారు. 

Tags:    
Advertisement

Similar News