ఈసారి గెలిస్తే 30 ఏళ్లు అధికారం మనదే.. కార్యకర్తలతో సీఎం జగన్

రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 88శాతం ఇళ్లకు మంచి చేశామని చెప్పిన జగన్, వచ్చే ఉగాది నుంచి ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ కూడా వస్తుందని చెప్పారు. ఈసారి గెలిస్తే.. మరో 30 ఏళ్లు మనమే అధికారంలో ఉంటామని అన్నారు.

Advertisement
Update: 2023-01-04 13:42 GMT

టీడీపీ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లో పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం అవుతున్న సీఎం జగన్.. ఈ దఫా విజయవాడ తూర్పు నియోజకవర్గ నాయకులతో మీటింగ్ పెట్టారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో నియోజకవర్గ ఇన్ చార్జ్ దేవినేని అవినాష్ సహా ఇతర నేతలు పాల్గొన్నారు. సమావేశంలో ప్రతి కార్యకర్తతో విడివిడిగా మాట్లాడారు జగన్. నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలను సూచించారు.

వైనాట్ 175

కార్యకర్తలకు జగన్ చెబుతున్న మాట ఒకటే, వైనాట్ 175. 175 స్థానాల్లో ఈసారి కచ్చితంగా విజయం మనదేనని అన్నారాయన. కుప్పంలో వైసీపీ ఎమ్మెల్యే లేకపోయినా స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేశామని గుర్తు చేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలో కూడా.. 21 వార్డుల్లో 14 చోట్ల గెలిచామని చెప్పారు. విజయవాడ మేయర్ పీఠం కూడా కైవసం చేసుకున్నామన్నారు. అదే రీతిలో ముందుకెళ్లాలని, అందరూ సమన్వయంతో పనిచేయాలన్నారు.

గతంలో ప్రత్యర్థి పార్టీ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల నేతలతో సమావేశం అయిన సందర్భంలో అక్కడికక్కడే ఎమ్మెల్యే అభ్యర్థుల్ని ప్రకటించారు సీఎం జగన్. కానీ విజయవాడ ఈస్ట్ విషయంలో మాత్రం ఆయన ఆచితూచి స్పందిస్తున్నారని అర్థమవుతోంది. నియోజకవర్గంలో అందరూ సమన్వయంతో పనిచేయాలన సూచించారు. గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని మరింత ఉధృతంగా చేపట్టాలని చెప్పారు. సచివాలయాల వారీగా కన్వీనర్లు, ప్రతి 50 నుంచి 70 ఇళ్లకు గృహసారథులను పార్టీ నుంచి నియమిస్తున్నామని పార్టీ కార్యక్రమాల్లో వారిని భాగస్వామ్యులను చేసుకుంటూ ముందుకు వెళ్తామన్నారు.

30ఏళ్లు మనమే..

రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 88శాతం ఇళ్లకు మంచి చేశామని చెప్పిన జగన్, వచ్చే ఉగాది నుంచి ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ కూడా పూర్తిస్థాయిలో వస్తుందని చెప్పారు. ఈసారి గెలిస్తే.. మరో 30 ఏళ్లు మనమే అధికారంలో ఉంటామని అన్నారు. ఎన్ని కష్టాలున్నాసరే.. బటన్‌ నొక్కే కార్యక్రమాన్ని తాను చేస్తున్నానని, నాయకులు చేయాల్సిన పనులు సక్రమంగా చేయాలన్నారు. మనకు ఓటు వేయని వారి ఇళ్ళకు కూడా వెళ్లి వారికి జరిగిన మంచిని వివరించాలన్నారు. వారిలో కూడా మార్పు తీసురు రావాలన్నారు. మనం వారి ఇళ్లకు వెళ్లకపోతే తప్పు చేసినట్టవుతుందని చెప్పారు జగన్.

Tags:    
Advertisement

Similar News