అందులో తప్పేముంది..? లారీ, ఆటో డ్రైవర్లతో సీఎం జగన్ ముఖాముఖి

సొంతంగా లారీ, టిప్పర్ కలిగి ఉండి డ్రైవర్ గా జీవనం గడుపుతున్నవారికి కూడా ఈదఫా వాహన మిత్ర పథకం అమలు చేస్తామని హామీ ఇచ్చారు జగన్.

Advertisement
Update: 2024-04-04 10:52 GMT

టిప్పర్‌ డ్రైవర్‌కు అసెంబ్లీ టికెట్ ఇచ్చానని చంద్రబాబు తనను అవహేళన చేశారని.. దాన్ని బట్టి ఆయన బుద్ధి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చని అన్నారు సీఎం జగన్. టిప్పర్ డ్రైవర్ ని చట్ట సభలో కూర్చోబెట్టేందుకే ఎమ్మెల్యేగా నిలబెడుతున్నానని అందులో తప్పేముందని ప్రశ్నించారు. ఏం తప్పు చేశానని టీడీపీ తనను, తన పార్టీ అభ్యర్థిని అవహేళన చేస్తోందని నిలదీశారు. శింగనమల నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వీరాంజనేయులు ఎంఏ ఎకనామిక్స్‌ చదివారని, చంద్రబాబు హయాంలో ఉద్యోగం రాకపోయినా వీరాంజనేయులు బాధపడకుండా ఉపాధి కోసం టిప్పర్‌ డ్రైవర్‌గా పని చేస్తున్నారని వివరించారు. టీడీపీలో కోట్ల రూపాయలు ఉన్నవారికే చంద్రబాబు సీట్లు ఇస్తున్నారని చెప్పారు జగన్.

మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా తిరుపతి జిల్లాలో పర్యటిస్తున్న సీఎం జగన్.. చిన్నసింగమలలో లారీ, ఆటో డ్రైవర్లతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటో, ట్యాక్సీ, టిప్పర్ డ్రైవర్లకు తమ ప్రభుత్వం అండగా ఉందని గుర్తు చేశారు జగన్. ఐదేళ్లుగా అన్ని వర్గాల వారిని ఆదుకున్నామని చెప్పారు. ఏడాది రూ.10వేల చొప్పున.. ఈ ఐదేళ్లలో రూ. 50 వేలు సాయంగా ఇచ్చామన్నారు. వాహన మిత్ర ద్వారా ఇప్పటివరకు రూ.1296 కోట్లు ఇచ్చామని చెప్పారు జగన్. సొంతంగా లారీ, టిప్పర్ కలిగి ఉండి డ్రైవర్ గా జీవనం గడుపుతున్నవారికి కూడా ఈదఫా వాహన మిత్ర పథకం అమలు చేస్తామని హామీ ఇచ్చారు జగన్.


ఈ సందర్భంగా అధికారం మళ్లీ మనదేనంటూ ఆటో డ్రైవర్లు నినాదాలు చేశారు. సీఎం జగన్ కి తాము స్టార్ క్యాంపెయినర్లం అని చెప్పారు మహిళా డ్రైవర్లు. వైసీపీకి భారీ మెజార్టీ ఖాయమని అన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చాక వాహనాల డ్రైవర్లకు బ్యాంకులనుంచి సులభంగా రుణాలు అందేలాగా చర్యలు చేపడతామన్నారు సీఎం జగన్. తక్కువ వడ్డీకే వారికి రుణాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. 

Tags:    
Advertisement

Similar News