పులివర్తి నానిది అంతా డ్రామా.. - చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి

పులివర్తి నానిని తాను రాజకీయ ప్రత్యర్థిగానే చూశానని, తనపై ఎన్ని విమర్శలు చేసినా తిరిగి విమర్శ చేయలేదని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తెలిపారు.

Advertisement
Update: 2024-05-26 03:13 GMT

పులివర్తి నానిది అంతా డ్రామా అని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. శ్రీ పద్మావతి వర్సిటీ వద్ద ఘర్షణలో నానికి గాయాలు కాలేదని, అక్కడి నుంచి యాక్టివ్‌గా నడుచుకుంటూ వెళ్లిపోయారని ఆయన చెప్పారు. కానీ, రెండు గంటల తర్వాత వీల్‌చైర్‌లో ఉన్నాడని, ఇదంతా డ్రామా కాక మరేంటని ఆయన ప్రశ్నించారు. పులివర్తి నాని డ్రామాల వల్ల నియోజకవర్గంలో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని ఆయన విమర్శించారు. చంద్రగిరిలో జరిగిన అల్లర్లపై శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

పులివర్తి నానిని తాను రాజకీయ ప్రత్యర్థిగానే చూశానని, తనపై ఎన్ని విమర్శలు చేసినా తిరిగి విమర్శ చేయలేదని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తెలిపారు. తన బావ మరిదిపై పులివర్తి నాని చేయి చేసుకున్నాడని, నామినేషన్‌ రోజు తన కారుపై దాడి చేశారని మండిపడ్డారు. తనను ఎంత ఇబ్బంది పెట్టినా నానిపై ఒక్క కేసు కూడా పెట్టలేదని గుర్తుచేశారు. ఎవరిపైనో విమర్శలు చేయాలనో, ఎవరినో తప్పు పట్టాలనో తాను సమావేశం ఏర్పాటు చేయలేదని ఆయన చెప్పారు. ఒక అవాస్తవం ప్రచారం చేస్తుంటే.. దాని వెనుక ఉన్న వాస్తవాలు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ సమావేశం ఏర్పాటు చేశానని ఆయన తెలిపారు.

తాను సామాజిక శాస్త్రంలో పట్టా పుచ్చుకున్నవాడినని, న్యాయ శాస్త్రంలో పట్టా పుచుకున్నవాడినని, కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకున్నవాడినని ఈ సందర్భంగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చెప్పారు. గత ఐదు సంవత్సరాలుగా తనపై విమర్శలు చేస్తున్నా, ఏ రోజూ చిన్న విమర్శ కూడా చేయలేదని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. చంద్రగిరిలో నారా లోకేష్‌ పాదయాత్ర చేస్తే ఎలాంటి అవాంఛ‌నీయ సంఘటనలూ జరగలేదని, నారా భువనేశ్వరి పర్యటన చాలా ప్రశాంతంగా జరిగిందని ఈ సందర్భంగా చెవిరెడ్డి తెలిపారు.

పులివర్తి నాని, అతని భార్య అసభ్య పదజాలంతో తనను రోజూ తిడుతున్నారని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చెప్పారు. పోలింగ్‌ రోజు పులివర్తి వర్గీయులు మోహిత్‌ కారును తగలబెట్టారని, సర్పంచ్‌ ఇంటికి నిప్పు పెట్టారని, ఇంకా సుధాకర్‌ అనే వ్యక్తి కాలికి బుల్లెట్‌ దిగిందని.. అతను చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని చెప్పారు. అయినా పులివర్తి, అతని వర్గీయులు తమపైనే విష ప్రచారం చేస్తున్నారని చెవిరెడ్డి మండిపడ్డారు. పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి చిత్తూరులో మహానటి ప్రదర్శన చేశారని ఆయన విమర్శించారు.

Tags:    
Advertisement

Similar News