టైమ్ చూసి లోకేష్ ని తెరపైకి తెస్తున్న చంద్రబాబు

ఇన్నిరోజులు జనసేనతో కలసి టీడీపీ నిర్వహించిన సభలకు లోకేష్ ని దూరం పెట్టిన చంద్రబాబు.. మోదీ వస్తున్న సభలో మాత్రం తన కొడుకు హైలైట్ కావాలనుకుంటున్నారు. పనిలో పనిగా పవన్ క్రేజ్ తగ్గించాలనేది బాబు ప్లాన్.

Advertisement
Update: 2024-03-12 08:15 GMT

నిన్న మొన్నటి వరకు టీడీపీ-జనసేన ఉమ్మడి మీటింగ్ లలో లోకేష్ ఎక్కడా కనపడలేదు. ఓ వ్యూహం ప్రకారమే ఆయన్ను పక్కనపెట్టారు చంద్రబాబు. సరిగ్గా టైమ్ చూసి ఇప్పుడు కొడుకుని తెరపైకి తెస్తున్నారు. ప్రధాని మోదీ పాల్గొనబోతున్న కూటమి బహిరంగ సభ నిర్వహణ బాధ్యత లోకేష్ కి అప్పగించారు. ఇక్కడ కూడా లోకేష్ చేసేదేమీ లేదు, టీడీపీ టీమ్ లు అన్ని పనులు చక్కబెడితే.. చివరకు సభ సక్సెస్ చేసింది లోకేషేనంటూ మోదీ ముందు బాబు బిల్డప్ ఇస్తారు. ఎల్లో మీడియా ద్వారా కావాల్సినంత హైప్ ఇస్తారు కాబట్టి ఈ సభకు ఎలాగూ ప్రచారం బాగానే జరుగుతుంది. రాగా పోగా మోదీ ముందు పెదబాబు, చినబాబు ఓవర్ యాక్షన్ ని మాత్రం జనాలు తట్టుకోలేరనేది వాస్తవం.

పవన్ కి తత్వం బోధపడేనా..?

మోదీతో చేతులు కలపకముందు పవన్ కల్యాణ్ ఒక్కరే బాబుకి పెద్ద దిక్కు. ఇప్పుడు బీజేపీ కూడా కూటమిలో కలిసింది కాబట్టి పవన్ ని చంద్రబాబు లైట్ తీసుకుంటారని తేలిపోయింది. సీట్ల లెక్క కూడా తేలిపోయింది కాబట్టి ఏపీలో పవన్ పార్టీకి వచ్చే సీట్లు, ఆ పార్టీ పరిస్థితి ఏంటనేది ఊహించవచ్చు. అందుకే మెల్లగా తన కొడుకు లోకేష్ ని ప్రొజెక్ట్ చేసేందుకు బాబు వ్యూహ రచన చేశారు. దీనికోసం చిలకలూరి పేట సభను ఉపయోగించుకోబోతున్నారు.

చిలకలూరి పేట సభ నిర్వహణ వ్యవహారాన్ని పూర్తిగా టీడీపీ భుజానికెత్తుకుంది. సభ నిర్వహణకోసం 13 కమిటీలను కూడా టీడీపీ ఏర్పాటు చేసింది. ఇందులో జనసేన పాత్ర పరిమితం. సిద్ధం సభలను మించి కూటమి సభను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు టీడీపీ వ్యూహ రచన చేస్తోంది. బహిరంగ సభ నిర్వహణ కోసం సుమారు 125 ఎకరాలను టీడీపీ నేతలు సిద్ధం చేస్తున్నారు. ఈ సభ ఏర్పాట్ల విషయంలో వేదికపై కూడా లోకేష్ హడావిడి కనపడేలా ముందుగానే చంద్రబాబు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇన్నిరోజులు జనసేనతో కలసి టీడీపీ నిర్వహించిన సభలకు లోకేష్ ని దూరం పెట్టిన చంద్రబాబు.. మోదీ వస్తున్న సభలో మాత్రం తన కొడుకు హైలైట్ కావాలనుకుంటున్నారు. పనిలో పనిగా పవన్ క్రేజ్ తగ్గించాలనేది బాబు ప్లాన్.

Tags:    
Advertisement

Similar News