ముద్రగడకు చంద్రబాబు అడ్డుపుల్ల.. అందుకే పవన్‌ కల్యాణ్‌ వెనక్కి..

ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ముద్రగడ జనసేనలో చేరకుండా చంద్రబాబు అడ్డుపడుతున్నట్లు తెలుస్తోంది. ఇది అర్థం కావడం వల్లనే ముద్రగడ పవన్‌ కల్యాణ్‌ మీద కూడా తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు భావిస్తున్నారు.

Advertisement
Update: 2024-02-21 05:12 GMT

కాపు నేత ముద్రగడ పద్మనాభం జనసేనలో చేరుతారంటూ ప్రచారం జరుగుతూ వచ్చింది. బొలిశెట్టి శ్రీనివాస్‌, మరికొంత మంది నాయకులు ఆయనను కలిసి జనసేనలో చేరాల్సిందిగా కోరారు. జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ముద్రగడను కలుస్తారని, ఆ తర్వాత ముద్రగడ జనసేనలో చేరుతారని చెప్పుతూ వచ్చారు. ముద్రగడ జనసేనలో చేరడం లాంఛనమేనని కూడా అన్నారు. కానీ, ఇప్పటి వరకు పవన్‌ కల్యాణ్‌ ముద్రగడతో భేటీ కాలేదు. దాని వెనక అసలు కారణం వేరే ఉందని ముద్రగడ మాటలను బట్టి అర్థమవుతోంది.

ముద్రగడకు టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అడ్డుపడుతున్నట్లు సమాచారం. చంద్రబాబు హయాంలోనే ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్లపై పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఆయన ఉద్యమాన్ని అణచివేయడానికి చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నించారు. ముద్రగడను అరెస్టు చేయడానికి వెళ్లిన పోలీసులు కుటుంబంలోని మహిళలను బూతులు తిట్టారు. వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ముద్రగడ చంద్రబాబును వ్యతిరేకిస్తూ మాట్లాడారు.

ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ముద్రగడ జనసేనలో చేరకుండా చంద్రబాబు అడ్డుపడుతున్నట్లు తెలుస్తోంది. ఇది అర్థం కావడం వల్లనే ముద్రగడ పవన్‌ కల్యాణ్‌ మీద కూడా తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు భావిస్తున్నారు. తనను కలవడానికి పవన్‌ వస్తే ఒక నమస్కారం పెడుతాం, లేదంటే రెండు నమస్కారాలు పెడుతామని ముద్రగడ వ్యాఖ్యానించారు. తాము చెప్పాల్సింది చెప్పామని, తనను చేర్చుకోవాలా వద్దా అనేది వారి నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు.

చంద్రబాబు ఆదేశిస్తే గానీ పవన్‌ కల్యాణ్‌ అడుగు ముందుకు వేసే పరిస్థితి లేదని ముద్రగడ వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది. పవన్‌ కల్యాణ్‌ తనను స్వయంగా పార్టీలోకి ఆహ్వానించకపోవడంపై ముద్రగడ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు కూడా తెలిసిపోతోంది.

Tags:    
Advertisement

Similar News