జగన్ ఏమిచేస్తే చంద్రబాబు అదిచేయాల్సిందేనా..?

తమ ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు వైసీపీ ఫిర్యాదు చేసింది కాబట్టి వెంటనే తాము కూడా స్పీకర్‌కు లేఖ ఇవ్వాలన్న పంతం మాత్రమే చంద్రబాబులో కనబడుతోంది.

Advertisement
Update: 2024-01-10 05:24 GMT

ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడుకు సొంత ఆలోచనలు అన్నవి ఎప్పుడో ఇంకిపోయినట్లున్నాయి. ఎదుటి వాళ్ళని చూసి కాపీ కొట్టడమే ఇప్పుడు చంద్రబాబు చేయగలుగుతున్నది. ఇప్పుడు విషయం ఏమిటంటే.. టీడీపీ తరఫున గెలిచి తర్వాత వైసీపీకి దగ్గరైన నలుగురు ఎమ్మెల్యేల‌పై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేయాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు.

ఇన్ని సంవత్సరాలు పట్టించుకోకుండా ఇప్పుడే అనర్హత వేటుపై స్పీకర్‌కు ఎందుకు చంద్రబాబు ఫిర్యాదు చేస్తున్నట్లు..? ఎందుకంటే వైసీపీలో గెలిచి టీడీపీలో చేరిన నలుగురు ఎమ్మెల్యేల‌పై అనర్హత వేటుకు వైసీపీ స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది కాబట్టే. నిజానికి వైసీపీ చేసిందే దండగ పని. మరో మూడునెలల్లో ఎన్నికలు జరగబోతున్నప్పుడు వీళ్ళ ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేస్తే ఏమిటి..? వేయకపోతే ఏమిటి..? వీళ్ళపై అనర్హత వేటు పడటం వల్ల వైసీపీకి వచ్చే లాభం ఏమీలేదు.

తమ ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు వైసీపీ ఫిర్యాదు చేసింది కాబట్టి వెంటనే తాము కూడా స్పీకర్‌కు లేఖ ఇవ్వాలన్న పంతం మాత్రమే చంద్రబాబులో కనబడుతోంది. సరే, ఇచ్చారనే అనుకుందాం ఏమవుతుంది..? ఏమీకాదు. ఎందుకంటే వైసీపీ తరపున గెలిచిన నలుగురు ఎమ్మెల్యేల్లో మేకపాటి చంద్రశేఖరరెడ్డి, కోటంరెడ్డి శ్రీధరరెడ్డి, ఉండవల్లి శ్రీదేవి డైరెక్టుగా చంద్రబాబు సమక్షంలోనే టీడీపీ కండువా కప్పుకున్నారు. వాళ్ళు పార్టీ ఫిరాయించినట్లు స్పీకర్ కన్ఫర్మ్ చేసుకుంటారు. కాబట్టి వాళ్ళపై అనర్హత వేటును స్పీకర్ సమర్థించుకుంటారు.

అయితే టీడీపీ తరఫున గెలిచి వైసీపీకి దగ్గరైన ఎమ్మెల్యేలు కరణం బలరాం, మద్దాలిగిరి, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్ వైసీపీలో చేరలేదు. వైసీపీకి సన్నిహితంగా ఉంటున్నారంతే. టీడీపీతో తాము విడిపోయాం కాబట్టి అసెంబ్లీలో ప్రత్యేకంగా సీట్లు కేటాయించాలని కోరారు. ఖాళీ ఉన్న సీట్లలో ఎక్కడైనా కూర్చోమని స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పారంతే. వీళ్ళెవరూ జగన్ సమక్షంలో వైసీపీ కండువాలు కప్పుకోలేదు కాబట్టి వీళ్ళపై అనర్హత వేటు పడే అవకాశాలు దాదాపు లేవనే చెప్పాలి.

Tags:    
Advertisement

Similar News