టీడీపీలో బకరా అయ్యేదెవరు?

వైసీపీ తరపున నామినేషన్లు వేయాల్సిన ఏడుగురికి జగన్మోహన్ రెడ్డి గురువారం బీఫారాలను ఇచ్చేశారు. వాళ్ళ ఎన్నిక ఇక లాంఛనమే అనుకుంటున్న సమయంలో టీడీపీ నుండి ఒక వార్త బయటకు వచ్చింది. అదేమిటంటే టీడీపీ తరపున కూడా ఒక‌రిని పోటీలోకి దింపుతున్నట్లు.

Advertisement
Update: 2023-03-10 06:36 GMT

చంద్రబాబు నాయుడు పార్టీలో బకరాను తయారు చేస్తున్నట్లున్నారు. ఎమ్మెల్యే కోటాలో భర్తీ కావాల్సిన ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ వేసేందుకు ఈ నెల 13 ఆఖరు తేదీ. వైసీపీ తరపున నామినేషన్లు వేయాల్సిన ఏడుగురికి జగన్మోహన్ రెడ్డి గురువారం బీఫారాలను ఇచ్చేశారు. వాళ్ళ ఎన్నిక ఇక లాంఛనమే అనుకుంటున్న సమయంలో టీడీపీ నుండి ఒక వార్త బయటకు వచ్చింది. అదేమిటంటే టీడీపీ తరపున కూడా ఒక‌రిని పోటీలోకి దింపుతున్నట్లు.

టీడీపీ తరపున ఎవరూ నామినేషన్ వేయకపోతే వైసీపీలో ఏడుగురు ఏకగ్రీవమైనట్లే. టీడీపీలో ఎవరైనా నామినేషన్ వేస్తే నామమాత్రమే అయినా పోటీ తప్పదు. నిజానికి టీడీపీ తరపున గెలిచే అవకాశం ఏమాత్రం లేదు. కాకపోతే వైసీపీకి ఏకగ్రీవంగా ఎమ్మెల్సీలను ఎందుకు ఇవ్వాలనే ఓర్వలేనితనం మాత్రమే కనబడుతోంది. పార్టీలో జరుగుతున్న ప్రచారం ప్రకారం మహిళ, బీసీ నేత అయిన పంచుమర్తి అనూరాధను పోటీలోకి దించాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారట.

అసెంబ్లీలో బలం ప్రకారం వైసీపీ ఏడు స్థానాలు గెలుస్తుంది. టీడీపీకి ఒక్క ఛాన్స్ కూడా లేదు. ఎందుకంటే ఒక ఎమ్మెల్సీకి 22 మంది ఎమ్మెల్యేలు ఓట్లేయాలి. వైసీపీకి ఉన్న బలం ప్రకారమైతే ఏడుగురిని గెలిపించుకునే సత్తా ఉంది. కానీ టీడీపీ తరపున గెలిచిన 23 మందిలో నలుగురు పార్టీతో తెగతెంపులు చేసుకున్నారు. కాబట్టి మిగిలిన 19 మందితో గెలవటం సాధ్యంకాదు. ఒకవేళ వైసీపీలో రెబల్ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధరరెడ్డి టీడీపీ అభ్యర్థికి ఓట్లేస్తారని అనుకున్నా పడే ఓట్లు 21 అవుతాయంతే.

ఇక్కడ గమనించాల్సిందేమంటే ఈ ఎన్నికల్లో విప్ చెల్లదు. విప్ జారీ చేస్తామని, అనర్హత వేటు వేయిస్తామని టీడీపీ నేతలు చెబుతున్నవన్నీ ఉత్తుత్తి బెదిరింపులు మాత్రమే. విప్ చెల్లదు కాబట్టి ఇక అనర్హత వేటు అనే ప్రశక్తే లేదు. కాబట్టి ఎమ్మెల్యేలు ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళకు వాళ్ళు ఓట్లేసుకోవచ్చు. ఒకపుడు రాజ్యసభ ఎన్నికల్లో కూడా వర్ల రామయ్యను ఇలాగే పోటీ చేయించి చంద్రబాబు గబ్బుపట్టించారు. మళ్ళీ ఇప్పుడు అనూరాధాతో నామినేషన్ వేయించాలని అనుకుంటున్నారట. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.

Tags:    
Advertisement

Similar News