చంద్రబాబు బెయిల్ షరతులపై హైకోర్టు కీలక ఆదేశాలు

చంద్రబాబు ర్యాలీల్లో పాల్గొనకూడదని చెప్పింది. ఈ కేసుకు సంబంధించి మీడియాలో ఎక్కడా మాట్లాడకూడదని తెలిపింది.

Advertisement
Update: 2023-11-03 05:52 GMT

చంద్రబాబు బెయిల్ షరతులపై హైకోర్టు కీలక ఆదేశాలు

చంద్రబాబుకి బెయిల్ ఇచ్చిన రోజే హైకోర్టు కొన్ని షరతులు విధించింది. అయితే మరిన్ని షరతులతో ఆయన్ను కట్టడి చేయాలని సీఐడీ అనుబంధ పిటిషన్ దాఖలు చేసింది. ఇద్దరు డీఎస్పీలను ఎప్పుడూ ఆయన దగ్గర ఉంచాలని కోర్టుని కోరింది. దీనిపై హైకోర్టు ఈరోజు కీలక ఆదేశాలిచ్చింది. బుధవారం వాదనలు ముగించిన కోర్టు, ఈ రోజు తీర్పు వెలువరించింది.

డీఎస్పీలు అవసరం లేదు..

ఇద్దరు డీఎస్పీలను చంద్రబాబుతో పాటు ఉంచాలన్న సీఐడీ అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. అదనపు షరతులేవీ అవసరం లేదని చెప్పింది. అయితే ఇప్పటి వరకు ఉన్న షరతులను చంద్రబాబు తప్పనిసరిగా పాటించాలని సూచించింది. గతంలో కోర్టు తెలిపిన షరతుల్ని కొనసాగించాలంటూ ఆదేశమిచ్చింది. చంద్రబాబు ర్యాలీల్లో పాల్గొనకూడదని చెప్పింది. ఈ కేసుకు సంబంధించి మీడియాలో ఎక్కడా మాట్లాడకూడదని తెలిపింది.

మరోవైపు చంద్రబాబు హైకోర్టు షరతుల్ని తుంగలో తొక్కారంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు జైలు బయటకు రాగానే రాజకీయ ఉపన్యాసాలిచ్చారంటున్నారు. రాజమండ్రి నుంచి ఉండవల్లి వరకు జరిగింది ర్యాలీయే కదా అని ప్రశ్నిస్తున్నారు. ర్యాలీల్లో పాల్గొనకూడదు, రాజకీయ వ్యాఖ్యలు చేయకూడదు అని కోర్టు చెప్పినా కూడా చంద్రబాబు ఆ నిబంధనలు పాటించడంలేదని చెబుతున్నారు.

టీడీపీ వాదన మరోలా ఉంది. తన కోసం వచ్చిన అభిమానుల్ని ఉద్దేశించి మాట్లాడటం వాక్ స్వాతంత్రపు హక్కు అంటున్నారు టీడీపీ నేతలు. అది ప్రాథమిక హక్కు అని, ఆ హక్కుని కోర్టులు అడ్డుకోలేవని అంటున్నారు. ఇక రాజమండ్రి నుంచి ఉండవల్లి వరకు, బేగంపేట నుంచి జూబ్లీహిల్స్ వరకు జరిగినవి ర్యాలీల లెక్కలోకి రావని అంటున్నారు టీడీపీ నేతలు. అభిమానులు ఆయన కోసం వచ్చారని, వారు చంద్రబాబుని అనుసరించారని చెబుతున్నారు. 


Tags:    
Advertisement

Similar News