జగన్‌ రూ.10 ఇస్తే.. మేం రూ.15 ఇస్తాం.. బాబు, పవన్‌ వేలం పాట

ఇన్నాళ్లూ జగన్‌ సంక్షేమ పథకాల వల్ల ఆంధ్రప్రదేశ్‌ మరో శ్రీలంక అవుతుందంటూ ప్రచారం చేసిన ఈ నేతలే ఇప్పుడు జగన్‌ కంటే మెరుగైన సంక్షేమం అందిస్తామని నమ్మబలుకుతున్నారు.

Advertisement
Update: 2024-04-12 04:42 GMT

ఏపీలో గడిచిన ఐదేళ్లు జగన్‌ అమలు చేసిన సంక్షేమ పథకాలపై పడి ఏడ్చిన చంద్రబాబు, పవన్‌కల్యాణ్.. ఇప్పుడు వేలం పాటపాడుతున్నారు. జగన్‌ బటన్‌ నొక్కుతున్నాడంటూ ఎద్దేవా చేసిన ఈ ఇద్దరు నేతలకు ఇప్పుడు తత్వం బోధపడినట్లుంది. దీంతో బహిరంగ సభల్లో వేలంపాట మొదలు పెట్టారు. జగన్‌ కంటే రూ.5 ఎక్కువే ఇస్తాం.. నమ్మండి అంటూ ప్రజలను ప్రాధేయపడుతున్నారు.

ఇన్నాళ్లూ జగన్‌ సంక్షేమ పథకాల వల్ల ఆంధ్రప్రదేశ్‌ మరో శ్రీలంక అవుతుందంటూ ప్రచారం చేసిన ఈ నేతలే ఇప్పుడు జగన్‌ కంటే మెరుగైన సంక్షేమం అందిస్తామని నమ్మబలుకుతున్నారు. గురువారం కోనసీమ జిల్లాలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడిన చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌.. పోటాపోటీగా ప్రకటనలు చేశారు. జగన్‌ కంటే అదనంగా ఓ వెయ్యి రూపాయలు ఎక్కువే ఇస్తామంటూ పవన్‌కల్యాణ్‌ చెప్పుకొచ్చారు. ఇక సంక్షేమం అని సరిగ్గా పలకరాని చంద్రబాబు సైతం జగన్‌ రూ.10 ఇస్తే తాను రూ.15 ఇస్తానంటూ ప్రకటన చేశారు. ఒకరకంగా జగన్‌ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయని ఈ ఇద్దరు నేతలు అంగీకరించినట్లే.


దాదాపు ఉమ్మడి ఏపీలో 9 ఏళ్లు, విభజిత ఆంధ్రప్రదేశ్‌కు 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు పేరు చెప్తే.. ఒక్క సంక్షేమ పథకం పేరు కూడా ఠక్కున గుర్తురాదు. ఇదే విషయాన్ని ఏపీ సీఎం జగన్‌ సైతం చాలా బహిరంగ సభల్లో ప్రస్తావించారు. కానీ, అలాంటి చంద్రబాబు.. మెరుగైన సంక్షేమం అందజేస్తానంటే నమ్మేదెవరు. ఇన్నాళ్లూ జగన్‌ అమలు చేస్తున్న పథకాల వల్ల రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని గగ్గోలు పెట్టిన చంద్రబాబు.. తాను ప్రవేశపెట్టిన సూపర్‌ సిక్స్ పథకాలకు డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారనే విషయాన్ని మాత్రం చెప్పట్లేదు.

Tags:    
Advertisement

Similar News