చలో మాచర్ల.. మరో కుట్రకు మాస్టర్ ప్లాన్

ఇప్పుడే ఇలాంటి పరిస్థితులు ఉంటే, ఇక ఫలితాల వేళ ఎలాంటి ఉద్రిక్తతలు నెలకొంటాయోనని అధికారులు భయపడుతున్నారు.

Advertisement
Update: 2024-05-23 06:27 GMT

ఏపీలో ఎన్నికల హింస సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. మాచర్ల కేంద్రంగా జరిగిన సంఘటనలు దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించాయి. అయితే ఇప్పటికీ అక్కడ టీడీపీ రెచ్చగొట్టే చర్యలను ఆపలేదు. చలో మాచర్ల పేరుతో ప్రత్యర్థి వర్గాలను రెచ్చగొట్టేందుకు టీడీపీ నేతలు బయలుదేరారు. ఈ కార్యక్రమానికి అనుమతి లేదంటూ పోలీసులు వారిని అడ్డుకున్నారు. టీడీపీలో కీలక నేతల్ని గృహనిర్బంధంలో ఉంచారు.

ఎందుకీ అత్యుత్సాహం..

మాచర్లలో పోలింగ్ లో అక్రమాలు జరిగాయనే సంగతి తెలిసిందే. కారణం మీరంటే మీరంటూ టీడీపీ, వైసీపీ నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కూడా ఈ అల్లర్లపై ఫోకస్ పెట్టింది. ఈ దశలో ఇప్పుడు చలో మాచర్ల పేరుతో గొడవలు పెంచేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. స్థానిక నేతల్ని పరామర్శించేందుకు ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి టీడీపీ నేతలు ఈరోజు మాచర్లకు బయలుదేరారు. పోలీసులు అనుమతి లేదని చెబుతున్నా కూడా వారు వినలేదు. దీంతో మాచర్లలో పోలీసులు బందోబస్తు పెంచారు. ఉద్రిక్తతలు తలెత్తకుండా సహకరించాలని జిల్లా ఎస్పీ మలికా గార్గ్‌ విజ్ఞప్తి చేశారు. ఎక్కడికక్కడ టీడీపీ నేతల్ని గృహ నిర్బంధంలో పెట్టారు.

ఫలితాల వేళ ఎలా ఉంటుందో..?

ఇప్పుడే ఇలాంటి పరిస్థితులు ఉంటే, ఇక ఫలితాల వేళ ఎలాంటి ఉద్రిక్తతలు నెలకొంటాయోనని అధికారులు భయపడుతున్నారు. ఇరు వర్గాలను శాంతింపజేసే ప్రయత్నాలు చేస్తున్నారు. గొడవలు జరుగుతాయనుకుంటున్న ప్రాంతాల్లో ఇప్పటినుంచే బందోబస్తు పటిష్టం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉందని, ఏ పార్టీ వారు కూడా రెచ్చగొట్టే ప్రకటనలు ఇవ్వొద్దని హెచ్చరించారు పోలీసులు.

మరోవైపు మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి సహా మరికొందరు నేతలు పోలీసుల తీరుపై మండిపడుతున్నారు. తమవారిని పరామర్శించేందుకు కూడా అనుమతి లేదా అని ప్రశ్నిస్తున్నారు. చలో మాచర్లను అడ్డుకోవడం అప్రజాస్వామికం అంటున్నారు. 

Tags:    
Advertisement

Similar News