పోలవరం ఎత్తుపై కేంద్రం జవాబు.. వైసీపీ హ్యాపీ

పూర్తి రిజర్వాయర్‌ ఎత్తు 45.72 మీటర్లు అని పేర్కొన్నారు. పోలవరం ఎత్తు తగ్గింపుపై తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. ప్రాజెక్టు ఎత్తు తగ్గించే అవకాశం లేదని క్లారిటీ ఇచ్చారు

Advertisement
Update: 2023-03-27 14:16 GMT

పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు తగ్గించేస్తున్నారు, రాష్ట్రాన్ని ముంచేస్తున్నారు, వైసీపీ పోలవరాన్ని కేంద్రానికి తాకట్టు పెట్టేసింది.. అంటూ ఇటీవల కాలంలో టీడీపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. పోలవరం మొదటి దశలో భాగంగా ప్రాజెక్టు ఎత్తు 41.15 మీటర్లకే పరిమితమని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ ఇటీవల పార్లమెంట్ లో ఇచ్చిన సమాధానమే ఈ వివాదానికి మూలం. 45.72 మీటర్లుగా ఉండాల్సిన పోలవరం ఎత్తుని 41.15కి తగ్గించారని, దీని ద్వారా ప్రాజెక్ట్ వ్యయం, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ వ్యయం భారీగా తగ్గిపోతుందని, దీనికోసమే ఏపీకి వైసీపీ ద్రోహం చేసిందని టీడీపీ విమర్శలు గుప్పించింది. కానీ వైసీపీ నెత్తిన పాలుపోసేలా కేంద్రం తాజాగా మరో ప్రకటన చేసింది. పోలవరం ఎత్తు 45.72 మీటర్లు అని స్పష్టం చేసింది.

పోలవరంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ సహాయమంత్రి బిశ్వేశ్వర్‌ తుడు రాతపూర్వక సమాధానం ఇచ్చారు. 1980 నాటి గోదావరి ట్రిబ్యునల్‌ అవార్డు ప్రకారం.. పూర్తి రిజర్వాయర్‌ ఎత్తు 45.72 మీటర్లు అని పేర్కొన్నారు. పోలవరం ఎత్తు తగ్గింపుపై తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. ప్రాజెక్టు ఎత్తు తగ్గించే అవకాశం లేదని క్లారిటీ ఇచ్చారు

పోలవరం సవరించిన అంచనాలపై కూడా ఎంపీ కనకమేడల ప్రశ్న సంధించారు. సవరించిన అంచనాలను కేంద్రం చెల్లిస్తుందా? అని ప్రశ్నించారు. 2017-18 ధరల మేరకు సవరించిన అంచనా వ్యయం రూ.47,725 కోట్లుగా ఉందన్న కేంద్ర ప్రభుత్వం.. 2019లో తమకు వచ్చిన సవరించిన అంచనా వ్యయం రూ.55,548కోట్లు అని పేర్కొంది. వచ్చిన అంచనాలను జలశక్తి శాఖ సాంకేతిక సలహా కమిటీ అంగీకరించిందని చెప్పింది. రాష్ట్రం చేసిన ఖర్చులో ఇప్పటివరకు రూ.13,463కోట్లు ఇచ్చామని స్పష్టం చేసింది. పోలవరం ఎత్తు తగ్గించడంలేదంటూ కేంద్రం క్లారిటీ ఇవ్వడంతో టీడీపీ విమర్శలు పసలేకుండా పోయాయి. 

Tags:    
Advertisement

Similar News