బీజేపీ - జనసేన గ్యాప్‌కు ఇదే నిదర్శనమా?

నిజంగానే మిత్రపక్షాల మధ్య అంత సఖ్యతుంటే పోటీ చేయబోయే మూడు స్థానాల్లో కనీసం ఒకదాన్ని జనసేనకు కేటాయించాలి కదా. ఒక్కటి కూడా కేటాయించకపోయినా పర్వాలేదు కనీసం పవన్‌తో చర్చలు జరిపి ఉండాలి. కానీ ఇదేమి చేయకుండానే బీజేపీ తనంతట తానుగా అభ్యర్థులను ప్రకటించేయటంలో అర్థ‌మేంటి?

Advertisement
Update: 2023-02-15 06:25 GMT

తాజాగా జరుగుతున్న పరిణామాలను బట్టి అందరిలోనూ ఇదే అనుమానం పెరిగిపోతోంది. విషయం ఏమిటంటే 14 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో తొమ్మిది స్థానాలు స్ధానిక సంస్థ‌ల కోటా, మూడు పట్టభద్రుల కోటాతో పాటు రెండు ఉపాధ్యాయ కోటాలో భర్తీ అవుతాయి. స్థానిక సంస్థ‌లు, ఉపాధ్యాయ కోటాలో భర్తీ అవ్వాల్సిన స్థానాలను బీజేపీ విడిచిపెట్టేసింది. పట్టభద్రుల కోటాలో భర్తీ అయ్యే మూడు స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తోంది.

ఇక్కడ గమనించాల్సిందేమంటే ఈ మూడు స్థానాలకు బీజేపీ ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించేసింది. మిత్రపక్షం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను మాట మాత్రంగా కూడా అడగలేదట. నిజంగానే మిత్రపక్షాల మధ్య అంత సఖ్యతుంటే పోటీ చేయబోయే మూడు స్థానాల్లో కనీసం ఒకదాన్ని జనసేనకు కేటాయించాలి కదా. ఒక్కటి కూడా కేటాయించకపోయినా పర్వాలేదు కనీసం పవన్‌తో చర్చలు జరిపి ఉండాలి. అభ్యర్థులను ప్రకటించేటప్పుడు బీజేపీ చీఫ్ సోమువీర్రాజు, పవన్ ఇద్దరు కలిసి మీడియా సమావేశం పెట్టుంటే కథ‌ వేరేలాగుండేది.

కానీ ఇదేమి చేయకుండానే బీజేపీ తనంతట తానుగా అభ్యర్థులను ప్రకటించేయటంలో అర్థ‌మేంటి? పవన్‌ను లెక్కచేయటం లేదనే బలమైన సంకేతాలు జనాల్లోకి వెళ్ళిపోయాయి. జనసేనకు మద్దతిచ్చే గ్రాడ్యుయేట్లు ఉండరా? లేకపోతే జనసేన మద్దతుదారులైన గ్రాడ్యుయేట్ల ఓట్లు అవసరం లేదని బీజేపీ అనుకుందా? అనే చర్చ పెరిగిపోతోంది.

పట్టభద్రుల నియోజకవర్గాలకు ఎన్నికలు జరగబోయే మూడు జిల్లాల్లో జనసేనకు కూడా ఎంతో కొంత ఓట్లయితే ఉంటాయి కదా. పైగా ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో తమకు బలముందని జనసేన నేతలు చెప్పుకుంటుంటారు. మరిప్పుడు జనసేనను మాట వరసకు కూడా బీజేపీ అడగని కారణంగా వాళ్ళ ఓట్లు ఎవరికి పోతాయి? సైలెంటుగా తమ ఓట్లను జనసేన టీడీపీకి వేయిస్తుందా? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. బహిరంగంగా పిలుపివ్వకపోయినా లోపాయికారీగా జరిగే ప్రయత్నాలతో జనసేన ఓట్లు టీడీపీకి పడితే అప్పుడు నష్టపోయేది బీజేపీనే కదా. ఈ విషయాన్ని కమలనాథులు ఎందుకు ఆలోచించ లేదు? ఇదే పాయింట్ మీద రేపు జనసేన దూరంగా జరిగితే బీజేపీ నేతలు ఎలా సమర్థించుకుంటారు ?

Tags:    
Advertisement

Similar News