రేవ్ పార్టీ కారుపై కీలక వివరాలు చెప్పిన కాకాణి

రేవ్ పార్టీతో తనకు సంబంధం లేదని చెబుతూనే.. సోమిరెడ్డి డ్రగ్స్ వాడతారని, తాగుబోతు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు కాకాణి.

Advertisement
Update: 2024-05-24 08:37 GMT

నెల్లూరు జిల్లాలో మంత్రి కాకాణి, మాజీ మంత్రి సోమిరెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందనే విషయం అందరికీ తెలుసు. సర్వేపల్లిలో మరోసారి ప్రత్యర్థులుగా మారిన కాకాణి, సోమిరెడ్డి ఎన్నికల వేళ ఒకరిపై ఒకరు తీవ్రంగా మాటలదాడిచేసుకున్నారు. ఎన్నికల తర్వాత కూడా వీరికి ఓ సబ్జెక్ట్ దొరికింది. బెంగళూరు రేవ్ పార్టీ దగ్గర ఓ కారులో కాకాణి ఎమ్మెల్యే స్టిక్కర్ దొరకడంతో సోమిరెడ్డి రెచ్చిపోయారు. కాకాణికి రేవ్ పార్టీతో సంబంధం ఉందని ఆరోపించారు. కాకాణి కారు అక్కడ ఎందుకు ఉందన్నారు, ఆ ఫామ్ హౌస్ యజమానితో కాకాణికి సంబంధాలున్నాయన్నారు. ఈ ఆరోపణలను వెంటనే ఖండించిన కాకాణి.. మరోసారి సోమిరెడ్డిపై ధ్వజమెత్తేందుకు ప్రెస్ మీట్ పెట్టారు. రేవ్ పార్టీతో తనకు సంబంధం లేదని చెబుతూనే.. సోమిరెడ్డి డ్రగ్స్ వాడతారని, తాగుబోతు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు కాకాణి.


ఆ కారు ఎవరిదంటే..?

రేవ్ పార్టీ జరిగిన ఫామ్ హౌస్ గోపాలరెడ్డిది అని మొదట వార్తలొచ్చాయని, అయితే ఆ తర్వాత అది లీజుకిచ్చారని ఆంగ్ల మీడియా వార్తలిచ్చిందని.. ఆ ఫామ్ హౌస్ ఓనర్ కానీ, లీజుదారులు కానీ తనకు అస్సలు తెలియదన్నారు కాకాణి. ఆ కారు సీ బుక్ చూస్తే తుమ్మల వెంకటేశ్వరరావుకి చెందినది అని రికార్డులు ఉన్నాయని, ఆయనతో తనకు సంబంధమేమీ లేదన్నారు కాకాణి. పోనీ సోమిరెడ్డి ఆరోపణలకు రుజువులు ఉంటే చూపించాలన్నారు.

నువ్వే తాగుబోతు, తిరుగుబోతు..

సోమిరెడ్డి తాగుబోతు, తిరుగుబోతు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు కాకాణి. ఆయన డ్రగ్స్ కూడా వాడతారన్నారు. సోమిరెడ్డికి దమ్ముంటే రక్తపరీక్షకు సిద్ధం కావాలన్నారు. నెల్లూరులో పోలీసులకు తమ ఇద్దరి రక్త నమూనాలు ఇస్తామన్నారు. దమ్ముంటే సోమిరెడ్డి తన సవాల్ స్వీకరించాలన్నారు కాకాణి. సోమిరెడ్డి వ్యవహారం గురించి గతంలో మీడియాలో వచ్చిన కథనాలను ప్రజల ముందుంచారు. 

Tags:    
Advertisement

Similar News