ఆరోగ్యశ్రీ గందరగోళం.. ఆస్పత్రులు అలా, అధికారులు ఇలా..

గత ఐదేళ్లలో ఆరోగ్యశ్రీ ద్వారా 42.91 లక్షల మందికి వైద్యసేవలకోసం రూ. 13,471 కోట్లు ఖర్చు చేశామన్నారు. మిగిలిన బకాయిలు త్వరలోనే విడుదల చేస్తామన్నారు ట్రస్ట్‌ సీఈవో లక్ష్మీషా.

Advertisement
Update: 2024-05-23 01:59 GMT

ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ అసోసియేషన్‌ (ఆశా) ప్రతినిధులు తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. కొన్ని ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ అడ్మిషన్లు జరగడం లేదని తెలుస్తోంది. ప్రభుత్వం బకాయిలు చెల్లించేంత వరకు ఆరోగ్యశ్రీ సేవలు అందించేది లేదని ఆయా యాజమాన్యాలు తేల్చి చెబుతున్నాయి. మరోవైపు ప్రభుత్వం మాత్రం ఆరోగ్యశ్రీ సేవలు అందించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తోంది. అమలు బాధ్యతను కలెక్టర్లకు అప్పగించింది. ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు అంతరాయం కలిగిస్తే ఆసుపత్రులపై చర్యలు తీసుకుంటామని ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ సీఈవో లక్ష్మీషా హెచ్చరించారు. వైద్య సేవలు ఆగకుండా చూడాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.

ఇప్పటి వరకు ఇచ్చింది ఎంత..?

2023-24లో ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ నుంచి రూ. 3,566.22 కోట్లు నెట్‌ వర్క్‌ ఆసుపత్రులకు జమ చేసినట్టు చెబుతున్నారు అధికారులు. గతంలో ఇచ్చిన హామీ ప్రకారం ఇప్పటికే 203 కోట్ల రూపాయలు విడుదల చేశామన్నారు. 2024-25 మొదటి రెండు నెలల్లో రూ.366 కోట్లు విడుదల చేశామన్నారు. గత ఐదేళ్లలో ఆరోగ్యశ్రీ ద్వారా 42.91 లక్షల మందికి వైద్యసేవలకోసం రూ. 13,471 కోట్లు ఖర్చు చేశామన్నారు. మిగిలిన బకాయిలు త్వరలోనే విడుదల చేస్తామన్నారు ట్రస్ట్‌ సీఈవో లక్ష్మీషా. అయినా కూడా ప్రైవేట్ ఆస్పత్రులు మొండి పట్టుదలకు పోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

మరోవైపు ఆస్పత్రుల యాజమాన్యాలు మాత్రం తగ్గేది లేదంటున్నాయి. పెండింగ్ బిల్లులు ఇవ్వకపోతే తాము చేసేదేం లేదని చెబుతున్నాయి. కొన్ని మినహాయింపులతో అత్యవసర వైద్య సేవల్ని అందిస్తున్నా.. బకాయిలు చెల్లించాలని మాత్రం డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే ఇన్‌పేషెంట్లుగా ఉన్న వారికి మాత్రం ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగుతున్నాయి.

Tags:    
Advertisement

Similar News