ఏపీ సీఎస్‌గా జవహర్ రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు.. సీనియర్ ఐఏఎస్‌ల బదిలీలు

జవహర్ రెడ్డికి 2024 జూన్ నెలాఖరు వరకు సర్వీసు ఉంది. అంటే ఆయన 19 నెలల పాటు సీఎస్‌గా ఉండబోతున్నారు.

Advertisement
Update: 2022-11-29 12:10 GMT

ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీ (సీఎస్)గా సీనియర్ ఐఏఎస్ అధికారి కేఎస్. జవహర్ రెడ్డిని నియమించారు. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఎస్ సమీర్ శర్మ బుధవారం (30న) రిటైర్ కానున్నారు. ఇప్పటికే సమీర్ శర్మకు రెండుసార్లు సీఎస్‌గా పొడిగింపు లభించింది. మరోసారి అందుకు అవకాశం లేకపోవడంతో వైఎస్ జగన్ ప్రభుత్వం కొత్త సీఎస్‌ను నియమించింది. డిసెంబర్ 1 నుంచి జవహర్ రెడ్డి సీఎస్‌గా బాధ్యతలు నిర్వ‌ర్తిస్తారు.

జవహర్ రెడ్డికి 2024 జూన్ నెలాఖరు వరకు సర్వీసు ఉంది. అంటే ఆయన 19 నెలల పాటు సీఎస్‌గా ఉండబోతున్నారు. ఇక రిటైర్ అవుతున్న సీఎస్ సమీర్ శర్మను రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి పోస్టులో కొనసాగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. దాంతో పాటు ఇనిస్టిట్యూట్ ఆఫ్ లీడర్‌షిప్, ఎక్స్‌లెన్స్ అండ్ గవర్నెన్స్ వైస్ చైర్మన్‌ పోస్టులో ఇంచార్జిగా నియమించనున్నట్లు తెలుస్తున్నది. గతంలో రిటైర్ అయిన సీఎస్‌లు పలువురు ఇలా వేరే పదవుల్లో కొంత కాలం కొనసాగారు.

జవహర్ రెడ్డి 1990 బ్యాచ్‌ ఐఏఎస్ అధికారి. ఆయన కంటే సీనియర్లుగా నీరభ్ కుమార్ (1987), పూనం మాలకొండయ్య (1988), శ్రీలక్ష్మి (1989) కరికాల్ వలెవన్ (1989) ఉన్నా.. వైఎస్ జగన్ మాత్రం జవహర్ రెడ్డివైపే మొగ్గు చూపారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి సీఎం జగన్‌కు జవహర్ రెడ్డి సన్నిహితంగా ఉన్నారు. ఆయన కోరిక మీదటే జవహర్ రెడ్డిని టీటీడీ ఈవోగా నియమించారు. అదే సమయంలో సీఎంవోలో కూడా కీలక బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో సీఎస్‌గా సన్నిహితుడైన వ్యక్తి ఉండాలనే ఉద్దేశంతోనే సీనియర్లను కాదని జవహర్ రెడ్డిని ఆ పదవికి ఎంపిక చేసినట్లు తెలుస్తున్నది.

ఇక కొత్త సీఎస్ రాకతో పలువురు ఇతర ఐఏఎస్ అధికారులను కూడా ఏపీ ప్రభుత్వం బదిలీ చేసింది. సీఎం స్పెషల్ సీఎస్‌గా పూనం మాలకొండయ్య, వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్‌గా మధుసూదన్ రెడ్డి, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ప్రవీణ్ ప్రకాశ్, ఆర్‌అండ్‌బీ కార్యదర్శిగా ప్రద్యుమ్న, వ్యవసాయ శాఖ కమిషనర్‌గా రాహుల్ పాండే, హౌసింగ్ డిపార్ట్‌మెంట్ ప్రత్యేక కార్యదర్శిగా మహమ్మద్ దివాన్‌ను నియమించారు. ప్రస్తుతం సెలవులో ఉన్న బుడితి రాజశేఖర్‌ను తిరిగి వచ్చిన తర్వాత జీఏడీలో రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Tags:    
Advertisement

Similar News