ఏపీలో మార్చి 9నుంచి సెల్ డౌన్, పెన్ డౌన్..

ఈసారి చాయ్‌, బిస్కెట్‌ సమావేశాలతో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఉద్యోగుల కోసం కేటాయించిన బడ్జెట్‌ ను రాష్ట్ర ప్రభుత్వం కావాలనే పక్కదారి పట్టిస్తోందని ఆరోపించారు.

Advertisement
Update: 2023-02-28 14:06 GMT

ఏపీ సీఎం జగన్ ఓవైపు బటన్ నొక్కడం, లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయడం చేస్తూనే ఉన్నారు. పేద ప్రజలంతా తనవైపే ఉన్నారని చెబుతున్నారు. కానీ మరోవైపు ఉద్యోగ వర్గాలు మాత్రం ఏపీలో ఇంకా అసంతృప్తితోనే ఉన్నట్టు తెలుస్తోంది. ఉద్యోగ సంఘాల నేతలు తాజాగా సమ్మె నోటీసు ఇచ్చారు. ఉద్యోగులంతా తమ డిమాండ్ల సాధనకు ఆందోళనబాట పట్టాలని ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. ఉద్యోగ సంఘం నేతలు సచివాలయంలో ఏపీ సీఎస్‌ జవహర్‌ రెడ్డిని కలిసి మార్చి 9 నుంచి చేపట్టబోతున్న ఉద్యమ కార్యాచరణ నోటీసు అందజేశారు.

సెల్ డౌన్, పెన్ డౌన్..

గతంలో ఉద్యోగులు సమ్మెలోకి దిగే ముందు శాంపిల్ గా పెన్ డౌన్ పాటించేవారు. రోజుకి కొన్నిగంటలసేపు విధులను పక్కనపెట్టి తన నిరసనను ప్రభుత్వానికి తెలియజేసేవారు. ఇప్పుడు కొత్తగా సెల్ డౌన్ కూడా పాటించబోతున్నారు. సెల్ ఫోన్ ద్వారా వచ్చే అధికారిక సమాచారం ఏదీ ఇచ్చిపుచ్చుకోరు, అధికారుల ఫోన్ కాల్స్ ఆన్సర్ చేయరు. ఇలా తమ నిరసనను తెలియజేస్తారనమాట. సమ్మెలోకి వెళ్తామంటున్న ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు కూడా.. మార్చి 9నుంచి సెల్ డౌన్, పెన్ డౌన్ చేపడతామన్నారు.

భవిష్యత్ కార్యాచరణ ఏంటి..?

ఎన్నికలకు టైమ్ తరుముకొస్తున్న వేళ, ఇప్పటికైనా ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలంటున్నారు ఏపీ ఉద్యోగులు. సీపీఎస్ రద్దు వ్యవహారంపైనే ప్రధానంగా ఫోకస్ పెడతామంటున్నారు. ఈసారి చాయ్‌, బిస్కెట్‌ సమావేశాలతో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఉద్యోగుల కోసం కేటాయించిన బడ్జెట్‌ ను రాష్ట్ర ప్రభుత్వం కావాలనే పక్కదారి పట్టిస్తోందని ఆరోపించారు. సెల్‌ డౌన్‌, పెన్‌ డౌన్‌ తర్వాత, భోజన విరామ సమయంలో నిరసనలు, ఆ తర్వాత కలెక్టరేట్లలో స్పందన దరఖాస్తులు ఇస్తామని వెల్లడించారు. అప్పటికీ స్పందించకపోతే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు.

Tags:    
Advertisement

Similar News