బాలినేని ఎఫెక్ట్.. ప్రకాశం ఎస్పీకి సీఎం కార్యాలయం పిలుపు

ఈ వ్యవహారం స్థానికంగా బాలినేనిని మరింత ఇబ్బంది పెట్టే అవకాశముంది. రాజకీయ జోక్యంతో అసలు నేరస్థులు తప్పించుకున్నా, బాధితులకు న్యాయం జరగకపోయినా.. ఏడాదిలోపే జరగాల్సిన ఎన్నికల్లో ఆ ప్రభావం కచ్చితంగా కనపడుతుంది.

Advertisement
Update: 2023-10-20 11:05 GMT

ప్రకాశం జిల్లాలో బాలినేని వర్సెస్ పోలీస్ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. ఒంగోలులో జరిగిన భూ కుంభకోణం, నకిలీ డాక్యుమెంట్లు, స్టాంపుల వ్యవహారంపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ తో విచారణ జరుపుతున్నారు జిల్లా ఎస్పీ మలికా గార్గ్. ఈ కేసు విచారణ విషయంలో స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి అలకబూనారు. ఇటీవలే సీఎంఓ కార్యాలయానికి వెళ్లి జిల్లా ఎస్పీ, స్థానిక పోలీసులపై ఫిర్యాదు చేశారు. అంతకు ముందే ఆయన తన సెక్యూరిటీని కూడా ప్రభుత్వానికి సరెండర్ చేశారు. ఈ క్రమంలో తాజాగా జిల్లా ఎస్పీ మలికా గార్గ్ కి ఏపీ సీఎంఓ నుంచి పిలుపు వచ్చింది. భూ కుంభకోణం వ్యవహారంలో పూర్తి వివరాలతో రావాలని ఆమెకు కబురందింది.

బాలినేని వర్సెస్ ఎస్పీ..

భూ కుంభకోణంలో బాలినేని పేరు ఉందా, లేదా అనేది అధికారికంగా ఇంకా తేలలేదు. అయితే తన నియోజకవర్గంలో జరిగిన తప్పు కావడంతో ఆ తప్పు తనపై పడుతుందనే ఆందోళన ఆయనలో మొదలైంది. అందుకే.. నిందితులెవరైనా వదిలిపెట్టొద్దు అంటూ ఆయన ఎస్పీకి నేరుగా ఫిర్యాదు చేశారు. తన అనుచరులైనా కూడా అరెస్ట్ కి వెనకాడొద్దని స్పష్టం చేశారు. కానీ ఎక్కడో.. పోలీసులతో వ్యవహారం తేడా కొట్టింది. పోలీసుల ఇన్వెస్టిగేషన్ తీరు బాలినేనికి నచ్చలేదు. అందుకే తన సెక్యూరిటీని కూడా సరెండర్ చేసి అసంతృప్తి బయటపెట్టారు. దీంతో నేరుగా సీఎంఓ నుంచి బాలినేనికి పిలుపొచ్చింది. అక్కడికి వెళ్లిన ఆయన సీఎం జగన్ ని కలవలేదు. సీఎం కార్యదర్శి ధనుంజయ రెడ్డికి ఫిర్యాదు చేసి వచ్చారు. జిల్లా పోలీసులు తనకు సహకరించడంలేదన్నారు.

తాడేపల్లికి చేరిన పంచాయితీ..

జిల్లా ఎస్పీని సీఎంఓ కార్యాలయం అధికారులు పిలిపించడంతో ఈ వ్యవహారం మరింత హాట్ టాపిక్ గా మారింది. ఇన్వెస్టిగేషన్ ఇంకా పూర్తికాకముందే రాజకీయ జోక్యం కలకలం రేపుతోంది. ఈ వ్యవహారం స్థానికంగా బాలినేనిని మరింత ఇబ్బంది పెట్టే అవకాశముంది. రాజకీయ జోక్యంతో అసలు నేరస్థులు తప్పించుకున్నా, బాధితులకు న్యాయం జరగకపోయినా.. ఏడాదిలోపే జరగాల్సిన ఎన్నికల్లో ఆ ప్రభావం కచ్చితంగా కనపడుతుంది. మరి జగన్ పంచాయితీ ఎలా ఉంటుందో చూడాలి. అలగడం అలవాటయిన బాలినేనికి సర్దిచెబుతారా..? లేక ఎస్పీనే చూసీ చూడనట్టు వెళ్లాలని ఆదేశిస్తారా..? వేచి చూడాలి. 


Tags:    
Advertisement

Similar News