గడువు కంటే ముందే ఎన్నికలు.. సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు

కాస్త ముందుగానే ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉందని, ఎన్నికలకు పూర్తి సన్నద్ధంగా ఉన్నప్పటికీ మంత్రులు క్షేత్రస్థాయిలో మరింత సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు.

Advertisement
Update: 2023-12-15 12:26 GMT

ఎన్నికలపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గడువు కంటే 20 రోజులు ముందుగానే ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికలు ఎప్పుడు వ‌చ్చినా సన్నద్ధంగా ఉన్నామన్నారు. దేశంలో సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్ ఆఖరులో జరగాల్సి ఉంది. అయితే ఈసారి ఎన్నికలు కొంత ముందుకొచ్చే అవకాశం ఉందని సీఎం జగన్ వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది.

ఇవాళ ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. ఈ సందర్భంగా సీఎం జగన్ మంత్రులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఈ దఫా కాస్త ముందుగానే ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉందని, ఎన్నికలకు పూర్తి సన్నద్ధంగా ఉన్నప్పటికీ మంత్రులు క్షేత్రస్థాయిలో మరింత సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. గతంలో కంటే 20 రోజులు ముందుగానే ఎన్నికల షెడ్యూల్ విడుదల కావొచ్చని సీఎం జగన్ అన్నారు.

ప్రతిపక్ష పార్టీలు, వాటికి కొమ్ముకాస్తున్న మీడియా సంస్థలు చేసే విష ప్రచారాలను తేలిగ్గా తీసుకోవద్దని ఆయన మంత్రులకు సూచించినట్లు తెలుస్తోంది. ఈ విష ప్రచారాలను బలంగా తిప్పి కొట్టాలని జగన్ మంత్రులను ఆదేశించిన‌ట్లు సమాచారం.

టెన్త్ ఎగ్జామ్స్ ముందుకొచ్చింది అందుకేనా?

సార్వత్రిక ఎన్నికలు ఈసారి ముందుగానే జరిగే అవకాశం ఉందని ప్రభుత్వానికి సమాచారం ఉండటంతోనే టెన్త్, ఇంటర్ పరీక్షలు కాస్త ముందే నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల సందర్భంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పరీక్షలను కాస్త ముందుగా నిర్వహిస్తున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఎన్నికలు గడువు కంటే ముందే వస్తుండటంతోనే విద్యార్థుల పరీక్షలు కూడా ఆలోగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది.

సాధారణంగా టెన్త్, ఇంటర్ పరీక్షలు మార్చి ఆఖరులో ప్రారంభమై ఏప్రిల్ రెండవ వారానికి ముగుస్తుంటాయి. ఎన్నికలు ముందే జరిగే అంశాన్ని దృష్టిలో పెట్టుకునే ఏపీ ప్రభుత్వం మార్చి నెల ముగిసేనాటికి టెన్త్, ఇంటర్ పరీక్షలను పూర్తి చేసేందుకు సిద్ధమైంది.

Tags:    
Advertisement

Similar News