ఈసారి సీఎంగా వైజాగ్ లోనే ప్రమాణ స్వీకారం

రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్‌ను కోల్పోయామని, హైదరాబాద్‌ కంటే మిన్నగా వైజాగ్‌ అభివృద్ధి చెందుతుందని ధీమా వ్యక్తం చేశారు సీఎం జగన్.

Advertisement
Update: 2024-03-05 07:05 GMT

'విజన్ విశాఖ'లో సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ డెవలప్‌మెంట్‌ సదస్సులో పాల్గొన్న ఆయన వైజాగ్ రాజధాని వ్యవహారంపై మరోసారి స్పందించారు. ఎన్నికల తర్వాత వైజాగ్‌ నుంచి పాలన సాగిస్తానని స్పష్టం చేశారు. మళ్లీ గెలిచి వచ్చాక వైజాగ్‌లోనే ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పారు. విశాఖ అభివృద్ధికి అన్ని విధాలుగా కట్టుబడి ఉంటానన్నారు జగన్.


Full View

వైజాగ్ ఎందుకు..?

వైజాగ్ ని రాజధానిగా సమర్థించినంత మాత్రాన అమరావతిని వ్యతిరేకించినట్టు కాదన్నారు సీఎం జగన్. అమరావతి శాసన రాజధానిగా ఉంటుందని, కర్నూలు న్యాయరాజధానిగా ఉంటుందని, విశాఖ పాలనా రాజధానిగా అవతరిస్తుందన్నారు. అమరావతిలో కొత్తగా రాజధాని నిర్మించాలంటే లక్ష కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టాల్సి వస్తుందన్నారు. అవే లక్షకోట్లు ఇతర రంగాల్లో పెట్టుబడిగా పెడితే దాని విలువ ఇరవయ్యేళ్ల తర్వాత ఎన్నిరెట్లు పెరుగుతుందో ఊహించుకోలేమని చెప్పారు జగన్.

రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్‌ను కోల్పోయామని, హైదరాబాద్‌ కంటే మిన్నగా వైజాగ్‌ అభివృద్ధి చెందుతుందని ధీమా వ్యక్తం చేశారు సీఎం జగన్. ఉత్పత్తి రంగంలో దేశంలోనే ఏపీ మెరుగ్గా ఉందని అన్నారు. రామాయపట్నం, కాకినాడ, మూలపేట, మచిలీపట్నం పోర్టులు కీలకంగా మారుతాయని చెప్పారు. గత ఐదేళ్లలో తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఏపీలో తలసరి ఆదాయం పెరిగిందన్నారు జగన్. ప్రతి సంక్షేమ పథకాన్ని పారదర్శకంగా అమలు చేస్తున్నామని, డీబీటీ పద్ధతి ద్వారా నేరుగా లబ్ధిదారులకు నగదును అందజేస్తున్నామని వివరించారు. ఏపీలో మహిళల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారాయన. ఏపీలో నిరుద్యోగం తగ్గి, ఉపాధి అవకాశాలు పెరిగాయని చెప్పారు జగన్. చిన్న, మధ్య తరహా పరిశ్రమలతో 30 లక్షల ఉద్యోగాలు వచ్చాయన్నారు. స్వయం ఉపాధి అవకాశాలు కూడా మెరుగయ్యాయని వివరించారు.

కొన్ని మీడియా సంస్థలు ప్రభుత్వంపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నాయని, ప్రతిపక్షాలకు లబ్ధి కలిగించేలా కథనాలు ఇస్తున్నాయని మండిపడ్డారు సీఎం జగన్. నాయకుడి ఆలోచన తప్పుగా ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందదన్నారు. స్వార్థ ప్రయోజనాల వల్ల విశాఖ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని, విశాఖ ఇంకా చాలా అభివృద్ధి చెందాల్సి ఉందన్నారు. సార్వత్రిక ఎన్నికల వేళ విశాఖ రాజధాని గురించి సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. 

Tags:    
Advertisement

Similar News