రామోజీరావు గుంటూరు రావాల్సిందే.. సీఐడీ నోటీసులు

మరికొందరు నిందితులతో కలసి రామోజీ రావుని విచారించాల్సి ఉందని, అందుకే ఆయన గుంటూరుకి రావాలని సీఐడీ తన నోటీసులో స్పష్టంగా పేర్కొంది.

Advertisement
Update: 2023-07-04 16:02 GMT

రామోజీరావు గుంటూరు రావాల్సిందే.. సీఐడీ నోటీసులు

మార్గదర్శి చిట్ ఫండ్ కేసులో ఆ సంస్థ చైర్మన్ రామోజీరావుకి ఏపీ సీఐడీ మరోసారి నోటీసులిచ్చింది. రేపు(బుధవారం) గుంటూరు సీఐడీ ఆఫీస్ కి రావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. మార్గదర్శి కేసులో రామోజీ A-1 నిందితుడు. ఆయన కోడలు, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్, మార్గదర్శిలో పనిచేసే మరికొందరు మేనేజర్లపై కూడా సీఐడీ కేసులు నమోదు చేసింది. ఇటీవల సీఐడీ అధికారులు హైదరాబాద్ వెళ్లి రామోజీ రావు దగ్గర సమాచారం సేకరించాలని ప్రయత్నించారు. అయితే ఆయన అనారోగ్య కారణాలతో విచారణకు సహకరించలేదు. దీంతో ఆయన్ను గుంటూరు రావాల్సిందిగా సీఐడీ నోటీసులు జారీ చేసింది.





41-ఎ నోటీసులు..

41ఏ సీఆర్పీసీ కింద సీఐడీ, రామోజీ రావుకి నోటీసులు జారీ చేసింది. మార్గదర్శి కేసులో జులై 5న ఉదయం 10:30 గంటలకు గుంటూరులోని కన్నవారితోటలో మెడికల్ కాలేజీ వెనక ఉన్న సీఐడీ కార్యాలయానికి రావాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. సీఐడీ డీఎస్పీ రవికుమార్ పేరుతో ఈ నోటీసులు జారీ అయ్యాయి.

కిం కర్తవ్యం..

మార్గదర్శి వ్యవహారంలో వీలైనంత వరకు విచారణను తప్పించుకోడానికి, కోర్టు కేసులను వాయిదాలతో నెట్టుకు వచ్చేందుకే రామోజీరావు ప్రయత్నిస్తున్నారు. తాజాగా సీఐడీ విచారణకు కూడా ఆయన గైర్హాజరయ్యేందుకు ఉన్న అవకాశాలన్నిటినీ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. కానీ ఈసారి సీఐడీ ఈ కేసు విషయంలో పట్టుదలతో ఉంది. చిట్ ఫండ్ లో ప్రజలు దాచుకున్న సొమ్ము పక్కదారి పట్టినట్టు పక్కాగా సాక్ష్యాధారాలు సేకరించారు అధికారులు. ఆస్తులు జప్తు చేశారు, కొన్ని ప్రాంతాల్లో చిట్ గ్రూప్ లు క్లోజ్ చేశారు. ఈ క్రమంలో మరికొందరు నిందితులతో కలసి రామోజీ రావుని విచారించాల్సి ఉందని, అందుకే ఆయన గుంటూరుకి రావాలని సీఐడీ తన నోటీసులో స్పష్టంగా పేర్కొంది. 

Tags:    
Advertisement

Similar News