విశాఖపై మరో నాన్ లోకల్ కన్ను

కొత్తగా మరో నాన్ లోకల్ నేత విశాఖపై మమకారం పెంచుకుని ఇక్కడే మకాం వేశారు. ఆయనే బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు.

Advertisement
Update: 2022-11-20 07:11 GMT

అందాల సాగరతీరం.. అపార వనరుల కేంద్రం.. వెనకబడిన తరగతులు వారి అస్తిత్వం.. విశాఖపట్టణం కొన్ని దశాబ్దాలుగా ఇతర ప్రాంత అగ్రవర్ణాలు తమ గుప్పిట్లో పెట్టుకున్నాయి. భూములు, వ్యాపారాలు, విద్యాసంస్థలు, రాజకీయాలన్నీ స్థానికేతరులైన ఇతరుల కబంధహస్తాల్లో ఉన్నాయి. స్థానికులు వీరికి తాబేదారులు, వందిమాగధులుగా మారాల్సి దుస్థితి వచ్చింది. ఎంవీఎస్ మూర్తి, సుబ్బిరామిరెడ్డి, కంభంపాటి హరిబాబు, గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామక్రిష్ణ, ఎంవీవీ సత్యనారాయణతోపాటు విశాఖలో రాజకీయాలు శాసించిన, శాసిస్తున్న ఏ ఒక్కరూ స్థానికులు కాదు. ఇక్కడ నుంచి పోటీచేసేందుకు కూడా ప్రకాశం జిల్లా నుంచి పురందేశ్వరి, కడప నుంచి వైఎస్ విజయమ్మ‌, నెల్లూరు నుంచి నేదురుమిల్లి జనార్దన్ రెడ్డి, జేడీ లక్ష్మీనారాయణ వంటి వారు దిగుమతి అయ్యారు.. ఇంకా అవుతూనే వున్నారు.

వైసీపీ అధికారంలోకి వచ్చాక ఉత్తరాంధ్ర ఇన్ చార్జిగా వచ్చిన విజయసాయిరెడ్డిది నెల్లూరు. తాజాగా ప్రకాశం జిల్లాకి చెందిన సీఎం జగన్ మోహన్ రెడ్డి బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి ఉత్తరాంధ్ర ఇన్ చార్జిగా వచ్చారు. పార్టీ ఏదైనా పోటీ చేసేది మాత్రం నాన్ లోకల్ వాళ్లే. ఓడినా, గెలిచినా పెత్తనం వీరిదే. వీళ్ల ప్రేమంతా విశాఖపట్నంపై కానేకాదు. అపారమైన వనరులు, గనులు, సముద్ర వ్యాపారాలు, పర్యాటక వ్యాపార అవకాశాలే వీరి లక్ష్యం. కొత్తగా మరో నాన్ లోకల్ నేత విశాఖపై మమకారం పెంచుకుని ఇక్కడే మకాం వేశారు. ఆయనే బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. ఉత్తర ప్రదేశ్ నుంచి రాజ్యసభకి ఎన్నికైన జీవీఎల్, నరసరావు పేట ప్రాంతానికి చెందినవారు. గత కొన్ని సంవత్సరాలుగా తన రహస్య వ్యాపారానికి విశాఖలో అడుగుపెట్టిన ఈ బీజేపీ ఎంపీ..విశాఖపై మనసు పారేసుకున్నారు.

వచ్చే ఎన్నికల్లో జనసేనతో బీజేపీ పొత్తు ఖరారైతే.. విశాఖ ఎంపీగా పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. దీనికోసం విశాఖలోనే అత్యధిక సమయం వుంటున్నారు. బీసీ సంఘాల వారితో సమావేశమవుతూ వారి సమస్యలు పరిష్కరిస్తానంటూ సభలు, సమావేశాలు పెడుతున్నారు. ఇవ్వన్నీ వ్యక్తిగతంగా చేస్తుండడంతో విశాఖకి చెందిన బీజేపీ నేతలు గుర్రుగా వున్నారు. జీవీఎల్ నరసింహారావు అనుకున్నది అనుకున్నట్టు జరిగితే, విశాఖ మరో నాన్ లోకల్ నేతని నెత్తిపై పెట్టుకుని భరించాల్సి వస్తుంది.

Advertisement

Similar News