బోనులో మరో చిరుత.. తిరుమలలో కొనసాగుతోన్న వేట

ప్రస్తుతం బోనులో బందీ అయిన చిరుత 40సార్లు ట్రాప్ కెమెరాలకు చిక్కింది, కానీ బోనులో పడకుండా తప్పించుంటోంది. ఎట్టకేలకు ఆ చిరుత కూడా బోనులో పడటంతో టీటీడీ అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.

Advertisement
Update: 2023-09-20 03:52 GMT

తిరుమల మెట్ల మార్గంలో మరో చిరుత బోనులో చిక్కింది. దీనితో కలిపి ఇప్పటి వరకు అధికారులు బంధించిన చిరుతల సంఖ్య ఆరుకి చేరింది. ఇందులో ఓ చిరుతను మొదట్లో అడవిలో వదిలిపెట్టారు. మిగతా ఐదు చిరుతలను తిరుపతిలోని ఎస్వీ జూపార్క్ కి తరలించారు. అయితే చిరుతల వేట ఇక్కడితో ఆగలేదని, అది నిరంతర ప్రక్రియ అని చెబుతున్నారు అధికారులు. కాలినడక మార్గంలో చిరుత లేదా ఇతర అటవీ జంతువుల సంచారం లేదు అని తేలే వరకు.. ట్రాప్ కెమెరాల్లో జంతువుల జాడ చిక్కనంత వరకు ఈ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని తెలిపారు.

తిరుమల మెట్లమార్గంలో చిన్నారి లక్షితపై దాడి చేసి, ఆ అమ్మాయిని చిరుతపులి చంపివేసిన ఘటన ఇంకా ఎవరూ మరచిపోలేదు. టీటీడీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన వేళ.. ఆపరేషన్ చిరుత మొదలైంది. అదే సమయంలో ప్రత్యామ్నాయంగా అలిపిరి మెట్ల మార్గంలో నడచి వెళ్లే భక్తులకు చేతికర్రలను కూడా ఊతమందించింది టీటీడీ. ట్రాప్ కెమెరాలతో చిరుతల వేట కొనసాగుతోంది. ఒకదాని తర్వాత ఒకటి వరుసగా ఆరు చిరుతలు బోనుల్లో చిక్కాయి.

మా చిత్తశుద్ధిని శంకించొద్దు..

లక్షిత కుటుంబానికి రూ.10లక్షలు పరిహారంగా ఇచ్చామని, భక్తులకు చేతికర్రలు ఇచ్చి చేతులు దులుపుకోలేదని, చిరుతల వేట కొనసాగుతూనే ఉంటుందని తెలిపారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సీఎం జగన్ వచ్చి వెళ్లిన మరుసటి రోజే చిరుతపులి బోనులో చిక్కడం విశేషం. ప్రస్తుతం బోనులో బందీ అయిన చిరుత 40సార్లు ట్రాప్ కెమెరాలకు చిక్కింది, కానీ బోనులో పడకుండా తప్పించుంటోంది. ఎట్టకేలకు ఆ చిరుత కూడా బోనులో పడటంతో టీటీడీ అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. అలిపిరి మార్గంలో 300 ట్రాప్ కెమెరాలను అమర్చారు అధికారులు, శ్రీవారి మెట్టు మార్గంలో 75కెమెరాలు ఉంచారు. నిరంతర నిఘా పెట్టారు. 

Tags:    
Advertisement

Similar News