చర్చలు మళ్లీ విఫలం.. జగన్ రంగంలోకి దిగాల్సిందే

తాజా చర్చలు కూడా విఫలం అయ్యాయి. జీతాలు పెంచకపోతే సమ్మె విరమించేది లేదని అంగన్వాడీ సంఘాలు స్పష్టం చేశాయి.

Advertisement
Update: 2023-12-27 02:14 GMT

మా డిమాండ్లన్నీ నెరవేరిస్తేనే సమ్మె విరమిస్తాం -అంగన్వాడీలు

జీతాలు పెంచడం కుదరనే కుదరదు -మంత్రి బొత్స

అయితే సమ్మె కొనసాగిస్తాం -అంగన్వాడీలు

మేం ప్రత్యామ్నాయం చూసుకుంటాం -మంత్రి బొత్స

అంగన్వాడీలతో ఏపీ ప్రభుత్వం తాజా చర్చల సారాంశం ఇది. జీతాలు పెంచే ప్రసక్తే లేదని, గ్రాట్యుటీ తమ చేతుల్లో లేదని తేల్చి చెబుతున్నారు మంత్రులు. దీంతో తాజాగా జరిగిన చర్చలు కూడా విఫలం అయ్యాయి. జీతాలు పెంచకపోతే సమ్మె విరమించేది లేదని అంగన్వాడీ సంఘాలు స్పష్టం చేశాయి.

ప్రభుత్వం హెచ్చరిక..

సమ్మె కారణంగా గర్భిణిలకు పోషకాహారం అందడం లేదని, పిల్లలకు బాలామృతం అందడం లేదని.. అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. వారు సమ్మె విరమించకపోతే ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూసుకుంటుందన్నారు. వేతనాలు పెంచాలనే ఒక్క డిమాండ్ మినహా మిగతా అన్నిట్నీ ఆమోదించామని, జీతాలు పెంచడానికి ఇది సరైన సమయం కాదని ఆయన వివరించారు. సంక్రాంతి తర్వాత మళ్లీ చర్చిద్దామని, ముందు విధుల్లో చేరాలని ఆయన సూచించారు.

తగ్గేది లేదు..

అంగన్వాడీలు మాత్రం తగ్గేది లేదంటున్నారు. జీతాలు పెంచాలనేదే తమ ప్రధాన డిమాండ్ అని చెబుతున్నారు. ఉధృతంగా సమ్మెలో పాల్గొంటున్నారు. నిరసన కార్యక్రమాల్లో కూడా నేరుగా ప్రభుత్వాన్నే టార్గెట్ చేస్తున్నారు. ఈ దశలో మంత్రులు, ఉపసంఘాలతో పని కాదని తేలిపోయింది. నేరుగా సీఎం జగన్ రంగంలోకి దిగి అంగన్వాడీలకు ఉపశమనం కలిగించే ప్రకటన ఇస్తేనే సమస్య పరిష్కారమయ్యేలా కనపడుతోంది. ఎన్నికల వేళ సమస్య మరింత తీవ్రం కాకముందే జగన్ దీనిపై దృష్టిసారించడం మంచిదని కొందరు పార్టీ నేతలే అంటున్నారు. 

Tags:    
Advertisement

Similar News