దేశంలోనే ఎక్కడా లేని విధంగా జగన్‌ ప్రభుత్వం మరో అడుగు

2024-25 విద్యా సంవత్సరంలో ఐబీ బోధనపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తారు. వారిలో బోధనా సామర్థ్యం, నైపుణ్యం పెంచే విధంగా ఈ శిక్షణ ఉంటుంది.

Advertisement
Update: 2024-01-31 10:49 GMT

ప్రభుత్వ విద్యా విధానంలో మరో విప్లవాత్మకమైన సంఘటనకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియంను ప్రవేశపెట్టడంతో పాటు విద్యా విధానంలో ఎనలేని సంస్కరణలు చేపట్టిన ప్రభుత్వం తాజాగా దేశంలోనే ఎక్కడ లేని విధంగా ప్రైవేట్‌ పాఠశాలల్లో సంపన్నుల పిల్లలు చదువుకునే ఇంటర్నేషనల్‌ బాకలారియెట్‌ (ఐబీ) సిలబస్‌ను పేద పిల్లలకు అందుబాటులోకి తెస్తోంది.

ఐబీ సిలబస్‌ అమలుపై ఏపీ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (ఎస్సీఈఆర్టీ) అధికారులతో ఐబీ ప్రతినిధులు బుధవారం సాయంత్రం ఒప్పందం చేసుకుంటారు. దీంతో ప్రపంచ స్థాయిలో పోటీ పడి విజయం సాధించేలా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద పిల్లలను తీర్చిదిద్దడంలో అడుగు పడుతుంది.

2024-25 విద్యా సంవత్సరంలో ఐబీ బోధనపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తారు. వారిలో బోధనా సామర్థ్యం, నైపుణ్యం పెంచే విధంగా ఈ శిక్షణ ఉంటుంది. ఉపాధ్యాయులే కాకుండా జిల్లా, మండల విద్యాధికారులు, ఎసీఈఆర్టీ, డైట్‌ సిబ్బంది, ఎస్‌ఎస్‌సీ, ఇంటర్మీడియట్‌ బోర్దు సిబ్బందికి ఐబీపై అవగాహన, సామర్థ్యం పెంచే విధంగా ఆ శిక్షణ ఉంటుంది. దీంతో వాళ్లంతా ప్రతిష్టాత్మకమైన ఐబీ గ్లోబల్‌ టీచర్‌ నెట్‌వర్క్‌లో భాగమవుతారు.

2025 జూన్‌ నుంచి ఒకటో తరగతిలో ఐబీ సిలబస్‌ బోధన ప్రారంభమవుతుంది. ఏటా ఒక్కో తరగతికి ఈ సిలబస్‌ను విస్తరిస్తూ 2035నాటికి పదవ తరగతిలో, 2037 నాటికి 12వ తరగతిలో అమలు చేస్తారు. పరీక్షల తర్వాత ఐబీ బోర్డు, ఏపీఎస్సీఈఆర్టీ ఉమ్మడిగా సర్టిఫికెట్లు ఇస్తాయి. ఈ సర్టిఫికెట్‌కు అంతర్జాతీయ గుర్తింపు కూడా ఉంటుంది.

ఐబీ సిలబస్‌ విశిష్టత ఇదే..

ఐబీ విద్య ప్రపంచంలోనే అత్యుత్తమ బోధన పద్ధతిగా గుర్తింపు సాధించింది. బట్టీ చదువులకు తిలోదకాలిచ్చి థీయరీతో పాటు ప్రాక్టికల్‌ అప్లికేషన్‌ పద్ధతిలో బోధన సాగుతుంది. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంచుతుంది.

సంగీతం, నృత్యం, క్రీడలు వంటి ఇతర అంశాల్లో కూడా విద్యార్థులకు శిక్షణ ఇస్తారు. ఇంటర్‌ డిసిప్లినరీ కాన్సెప్ట్‌ ఆధారంగా బోధన ఉంటుంది. ఈ సిలబస్‌ను అభ్యసించిన విద్యార్థులు ఇతరులతో పోలిస్తే ప్రపంచంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో మూడు రెట్లు అధికంగా ప్రవేశాలు పొందుతున్నారు. ప్రపంచ స్థాయి ఉద్యోగాలను కూడా త్వరితగతిన పొందుతున్నారు.

Tags:    
Advertisement

Similar News