అనకాపల్లి ఎంపీ అభ్యర్థి ఆయనే.. జగన్ తుది నిర్ణయం

ఆయన్ను ఎంపీ అభ్యర్థిగా మార్చడంతో మాడుగుల స్థానం ఖాళీ అయింది. ఆ స్థానం కూడా బూడి కుటుంబానికే కేటాయించారు సీఎం జగన్.

Advertisement
Update: 2024-03-26 10:11 GMT

దాదాపుగా ఫైనల్ అయిపోయింది అనుకుంటున్న వైసీపీ జాబితాలో మళ్లీ చిన్న మార్పు చోటు చేసుకుంది. అనకాపల్లి ఎంపీ ఆభ్యర్థిగా డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడిని ఎంపిక చేశారు సీఎం జగన్. ఈ నిర్ణయంతో మాడుగుల అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. ఆ స్థానం బూడి ముత్యాలనాయుడు కుమార్తె అనురాధకు ఖరారు చేశారు. దీంతో డిప్యూటీ సీఎం బూడి ఫ్యామిలీ జాక్ పాట్ కొట్టినట్టయింది. ఎమ్మెల్యేగా ఉన్న ఆయనకు ఎంపీ అభ్యర్థిగా ప్రమోషన్, ఆయన కుమార్తెకు అసెంబ్లీ సీటు.. రెండూ ఒకేసారి ఖాయమయ్యాయి.

ఎందుకీ మార్పు..?

ఇటీవల ఇడుపులపాయలో వైసీపీ ఫైనల్ లిస్ట్ విడుదల కాగా.. అందులో అనకాపల్లి ఎంపీ స్థానం ఒక్కటే పెండింగ్ లో ఉంది. ఆ స్థానం బీసీలకు ఇవ్వాలని భావించారు సీఎం జగన్. సిట్టింగ్ ఎంపీ బీశెట్టి వెంకట సత్యవతిని పక్కనపెట్టారు. ప్రస్తుతం అక్కడ కూటమి అభ్యర్థిగా బీజేపీ నుంచి సీఎం రమేష్ పోటీ చేస్తున్నారు. దీంతో బలమైన అభ్యర్థికోసం సీఎం జగన్ మరింత కసరత్తు చేయాల్సి వచ్చింది. చివరిగా డిప్యూటీసీఎం బూడి ముత్యాలనాయుడినే ఎంపీ స్థానానికి పోటీలో నిలబెడుతున్నారు. ఆయన అయితేనే సీఎం రమేష్ కి గట్టిపోటీ ఉంటుందని భావిస్తున్నారు జగన్.

వైసీపీ ఫైనల్ లిస్ట్ లో బూడి ముత్యాలనాయుడికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న మాడుగుల అసెంబ్లీ స్థానమే ఖరారు చేశారు. ఇప్పుడాయన్ను ఎంపీ అభ్యర్థిగా మార్చడంతో మాడుగుల స్థానం ఖాళీ అయింది. ఆ స్థానం కూడా బూడి కుటుంబానికే కేటాయించారు జగన్. మంత్రి కుమార్తె, కె.కోటపాడు జడ్పీటీసీ సభ్యురాలు ఈర్లె అనురాధకు మాడుగుల వైసీపీ టికెట్ ఖాయం చేశారు. బూడి ముత్యాల నాయుడు కొప్పుల వెలమ సామాజిక వర్గానికి చెందిన నేత. కూటమి అభ్యర్థి సీఎం రమేష్ కి ఆయన బలమైన ప్రత్యర్థి అవుతారనడంలో సందేహం లేదు. 

Tags:    
Advertisement

Similar News