కన్నా ఎంట్రీతో ఇరకాటంలో పడిన అంబటి రాంబాబు.. ఇప్పుడెలా..?

2024 ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి కోడెల శివప్రసాద్ కొడుకు కోడెల శివరాం పోటీపడతారని అంతా ఊహించారు. స్థానికంగా కోడెల ఫ్యామిలీపై ఉన్న వ్యతిరేకత కారణంగా మళ్లీ తన గెలుపు ఖాయమనే ధీమాలో అంబటి రాంబాబు కనిపించారు.

Advertisement
Update: 2023-06-03 05:27 GMT

ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో టీడీపీ చాలా వేగంగా పావులు కదుపుతోంది. అన్ని నియోజకవర్గాల్లోనూ సమీక్షలు నిర్వహిస్తూ అభ్యర్థుల బలాబలాన్ని సమీక్షిస్తోంది. ఈ క్రమంలో అవసరమైతే అభ్యర్థుల్ని మార్చేందుకు కూడా వెనుకాడబోమని సంకేతాలు ఇస్తోంది. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో సడన్‌గా కన్నా లక్ష్మీనారాయణని తెరపైకి తీసుకురావడమే ఇందుకు ఉదాహరణ. ఇన్నాళ్లూ కోడెల ఫ్యామిలీకి టీడీపీపరంగా ఆ నియోజకవర్గం ఓ అడ్డాలా ఉండేది. కానీ, ఇప్పుడు కన్నా రాకతో కోడెల ఫ్యామిలీ ఒక్కటే కాదు.. మంత్రి అంబటి రాంబాబు కూడా ఇరకాటంలో పడ్డారు.

సత్తెనపల్లిలో కోడెల ఫ్యామిలీ అరాచకాలపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. టీడీపీ హయాంలో స్పీకర్‌గా ఉన్న కోడెల శివప్రసాద్ రావు అండతో అతని కొడుకు కోడెల శివరాం, కూతురు విజయలక్ష్మి బెదిరింపులకి పాల్పడ్డారని అప్పట్లో 7-8 కేసులు కూడా నమోదయ్యాయి. అయితే 2019 ఎన్నికల్లో కోడెల శివప్రసాద్ రావు అనూహ్యంగా అంబటి రాంబాబు చేతిలో ఓడిపోయారు. అప్పట్లో అంబటి రాంబాబుకి 1,05,063 ఓట్లు పడగా.. కోడెలకి 84,187 ఓట్లు పోల‌య్యాయి. అలానే జనసేన అభ్యర్థి వెంకటేశ్వర రెడ్డికి 9,729 ఓట్లు పడ్డాయి. ఆ ఎన్నికలు ముగిసిన కొన్ని రోజులకే స్పీకర్‌గా ఉన్నప్పుడు కోడెల అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు వెలుగులోకి వచ్చింది. దాంతో టీడీపీ నేతలు కూడా అతడ్ని పక్కనపెట్టేశారు. చివరికి చంద్రబాబు కూడా అతనికి అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. దాంతో కొంతకాలానికే అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తర్వాత కూడా కోడెల ఫ్యామిలీకి టీడీపీ పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు.

2024 ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి కోడెల శివప్రసాద్ కొడుకు కోడెల శివరాం పోటీపడతారని అంతా ఊహించారు. స్థానికంగా కోడెల ఫ్యామిలీపై ఉన్న వ్యతిరేకత కారణంగా మళ్లీ తన గెలుపు ఖాయమనే ధీమాలో అంబటి రాంబాబు కనిపించారు. కానీ.. తాజాగా కన్నా రాకతో అటు కోడెల ఫ్యామిలీ.. ఇటు అంబటి రాంబాబు కూడా ఇరకాటంలో పడ్డారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో ఓటు బ్యాంక్ చీలకుండా జాగ్రత్తపడిన టీడీపీ.. రాజకీయ అనుభవం మెండుగా ఉన్న కన్నాని పోటీగా నిలపబోతోంది. ఈ ప్లాన్‌తోనే కాబోలు బీజేపీ నుంచి కన్నాని ఇటీవల పార్టీలోకి టీడీపీ లాగేసింది. ఈసారి జనసేనతో పొత్తు కూడా టీడీపీకి అక్కడ కలిసిరానుంది.

సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబుకి కూడా కాస్త వ్యతిరేకత కనిపిస్తోంది. ఓ మహిళతో అతను అసభ్యంగా ఫోన్‌లో మాట్లాడినట్లు ఉన్న ఓ ఆడియో టేప్‌ని టీడీపీ అప్పట్లో వైరల్ చేసింది. దాంతో అంబటి రాంబాబు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఎన్నికల ముందు ఆ వివాదాన్ని మరోసారి టీడీపీ తెరపైకి తెచ్చే అవకాశాలు లేకపోలేదు. దాంతో సత్తెనపల్లిలో గెలుపు ఈసారి అంబటి రాంబాబుకి అంత సులువు కాదు!

Tags:    
Advertisement

Similar News