పవన్ కల్యాణ్ పై పోటీకి సై అన్న అలీ.. నియోజకవర్గం ఏదంటే..?

సీఎం జగన్ ఆదేశిస్తే వైసీపీ తరపున తాను పవన్ కల్యాణ్ పై పోటీకి సై అన్నారు రాష్ట్ర ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు అలీ. పవన్ ఏ నియోజకవర్గాన్ని ఎంచుకున్నా, అక్కడ ఆయనపై వైసీపీ అభ్యర్థిగా తాను పోటీ చేస్తానన్నారు.

Advertisement
Update: 2023-01-17 09:39 GMT

ఇటీవల చంద్రబాబుపై కుప్పం నుంచి పోటీకి మంత్రి పెద్ది రెడ్డి సై అన్నారు. దమ్ముంటే చంద్రబాబు పుంగనూరులో కూడా పోటీ చేయాలంటూ ఆయన సవాల్ విసిరారు. ఆ సంగతి పక్కనపెడితే ఇప్పుడు పవన్ కల్యాణ్ కి కూడా పోటీదారు రెడీ అయ్యారు.

సీఎం జగన్ ఆదేశిస్తే వైసీపీ తరపున తాను పవన్ కల్యాణ్ పై పోటీకి సై అన్నారు రాష్ట్ర ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు అలీ. పవన్ ఏ నియోజకవర్గాన్ని ఎంచుకున్నా, అక్కడ ఆయనపై వైసీపీ అభ్యర్థిగా తాను పోటీ చేస్తానన్నారు. ఆ విషయంలో పార్టీ ఆదేశాలను పాటిస్తానన్నారు.

అయితే పవన్ ఈసారి రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తారా, ఆ లిస్ట్ లో.. ఆయన గతంలో పోటీ చేసిన నియోజకవర్గాలు ఉంటాయా.. లేక ఆయన కొత్తగా ఒకే ఒక్క నియోజకవర్గానికే పరిమితం అవుతారా అనేది తేలాల్సి ఉంది. అలీ ఉత్సాహం చూసి ఆయనకు పవన్ పై పోటీ చేసే అవకాశాన్ని పార్టీ అధినేత జగన్ ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

డైమండ్ రాణి అంటే అర్థం ఇది..

మంత్రి రోజా నియోజకవర్గం నగరిలో కొండచుట్టు ఉత్సవంలో పాల్గొన్నారు అలీ. ఈ సందర్బంగా నగరి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రి రోజాపై పవన్‌ కల్యాణ్‌ చేసిన డైమండ్‌ రాణి కామెంట్లపై కూడా అలీ స్పందించారు. డైమండ్ అనేది చాలా పవర్ పుల్ అని, చాలా విలువైనది అని అన్నారు అలీ. రోజా ఫైర్ బ్రాండ్ అని, ఆమె తగ్గేదే లేదన్నారు. డైమండ్ రాణి అంటే అర్థం అదేనన్నారు.

175 మనవే..

ఏపీలో 175 నియోజకవర్గాల్లో అన్నింటినీ వైసీపీ కైవసం చేసుకుంటుందని అన్నారు అలీ. టీడీపీ, జనసేన, బీజేపీ.. కలసి పోటీ చేసినా, విడివిడిగా పోటీ చేసినా పెద్దగా తేడా ఉండదని, విజయం వైసీపీది అయినప్పుడు ప్రతిపక్షాలు కలిస్తే ఏంటి, కలవకపోతే ఏంటి అని అన్నారు అలీ. ఏపీకి ఎవరు ఎలాంటి మేలు చేశారో ప్రజలందరికీ తెలుసన్నారు అలీ. మెగాస్టార్‌ చిరంజీవి ఫ్యామిలీతో మంత్రి రోజాకు సత్సంబంధాలు ఉన్నాయన్నారు. రాజకీయాల్లో విమర్శలకు ప్రతి విమర్శలు చేయడం సహజమేనని చెప్పారు. సినిమాలు వేరు, రాజకీయాలు వేరు అని స్పష్టం చేశారు.

Tags:    
Advertisement

Similar News